- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మరో మైలురాయికి చేరుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరో కీలక మైలురాయిని చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ, 2025 డిసెంబర్ నాటికి 1000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించింది. నైపుణ్య విద్యా రంగంలో ఇంత తక్కువ టైమ్‌లో ఈ స్థాయి లక్ష్యాన్ని అందుకోవటం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పడింది. 2024 ఆగస్టు 1న యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. Public–Private Partnership విధానంలో దీన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండగా, పరిశ్రమల రంగానికి చెందిన ప్రముఖులతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తోంది. ఆనంద్మహీంద్రా బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.
ఆధునిక ల్యాబ్ బ్లాక్ ఏర్పాటు
యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా డా. వీ.ఎల్.వీ.ఎస్.ఎస్. సుబ్బారావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన శాశ్వత క్యాంపస్ హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం – ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉంది. 57.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ క్యాంపస్‌లో 43 తరగతి గదులు, 600 పడకల హాస్టల్, 84 వేల చదరపు అడుగుల ఆధునిక ల్యాబ్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. 2026 మార్చి నాటికి ఫేజ్-1 క్యాంపస్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాశ్వత క్యాంపస్ సిద్ధమయ్యే వరకు IIIT హైదరాబాద్‌లో తాత్కాలిక క్యాంపస్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి రంగాల్లో శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నారు. షార్ట్ టర్మ్, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులకు కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా నైపుణ్యాలు నేర్పుతున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డీస్ ల్యాబ్స్, AIG హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, GMR కార్గో వంటి ప్రముఖ సంస్థలు యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవటంతో ఈ సంస్థలన్నీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిగ్రీలు కాకుండా జాబ్గ్యారంటీ లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, తెలంగాణ యువతకు ఉద్యోగ భవితను అందించే కీలక కేంద్రంగా మారనుంది.






