- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాలంటరీ సర్వీస్‌కు జై కొట్టిన యువ డాక్టర్లు..పల్లెల్లో ఉచిత వైద్య శిబిరాలు
యంగ్ డాక్టర్స్ వాలంటరీ సర్వీస్‌కు ముందుకొచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: యంగ్ డాక్టర్స్ వాలంటరీ సర్వీస్‌కు ముందుకొచ్చారు. వ్యాధులపై అవగాహన లేని, సరైన సమయంలో ఆస్పత్రులకు వెళ్లలేని మారుమూల పల్లెల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. తమతో వచ్చేవారెవరో చెప్పాలన్నారు. అలా చూస్తుండగానే ఓ పది మంది స్పెషలిస్టులు, 50 మంది వరకు పీజీ డాక్టర్లు, జూడాలు, ఇంటర్న్, ఫైనల్ ఇయర్ మెడికోలు దీనికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి ఓ తేదీ నిర్ణయించుకొని వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. మొట్టమొదటగా గత ఆదివారం మారుమూల గ్రామమైన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 60 మందితో కూడిన వైద్య బృందం అక్కడ ప్రత్యేక వైద్య సేవలందించింది.
ప్రజల వద్దకే స్పెషలిస్ట్ డాక్టర్స్..
దామెరవాయిలో సుమారు 300 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ సుమారు 1500 గ్రామస్తులకు ఈ వైద్యుల బృందం ఉచిత వైద్యసేవలందించింది. అంతేకాకుండా ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించింది. ఈ క్యాంపులో పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉత్సాహంగా పాల్గొని పేషెంట్లకు చికిత్స అందించడం గమనార్హం. దీంతో గ్రామస్తులు తమకు ఉన్న వైద్య సమస్యలను వారికి వివరించి ట్రీట్మెంట్ పొందారు. కాగా, మెగా వైద్యశిబిరంలో పాల్గొనడం ఒక అద్భుత అనుభవమని, సమాజం పట్ల తమకున్న నైతిక బాధ్యతను ఇలాంటి క్యాంపులు గుర్తు చేస్తాయని కాకతీయ మెడికల్ కాలేజీ యువ వైద్యులు తెలిపారు.
రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు
స్థానిక యువ వైద్యుల సహకారంతో మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు రెగ్యులర్ గా నిర్వహిస్తామని నిర్వాహకులు డాక్టర్ శ్రీనాథ్అన్నారు. కెరీర్ ప్రారంభంలో సమాజం పట్ల అవగాహన పెంచుకోవడమే కాకుండా.. ప్రజల సాధక బాధకాలను తెలుసుకోవడానికి యువ వైద్యులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా, సమాజం పట్ల బాధ్యతతో డాక్టర్లు ఉచిత వైద్య సేవలందించడానికి ముందుకు రావడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా, క్యాంపులో మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డా.ఎం రాజీవ్, డాక్టర్ నరేశ్, తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రెసిడెంట్ డా.ఐజాక్ న్యూటన్, కేఎంసీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.






