- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాంగ్ మెమోలు ఆలస్యం! నెలల తరబడి ఇంటర్ విద్యార్థులకు తప్పని తిప్పలు
ప్రతియేటా ఇంటర్మీడియట్ లాంగ్ మెమోల జారీలో ఇంటర్ బోర్డు తీవ్ర అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. పరీక్షలు పూర్తయి, ఫలితాలు ప్రకటించి నెలలు గడుస్తున్నా.. మెమోలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతియేటా ఇంటర్మీడియట్ లాంగ్ మెమోల జారీలో ఇంటర్ బోర్డు తీవ్ర అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. పరీక్షలు పూర్తయి, ఫలితాలు ప్రకటించి నెలలు గడుస్తున్నా.. మెమోలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో వారికి తిప్పలు తప్పడం లేదు. మెమోలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నా.. ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
మూడు నెలల సమయమా?
రాష్ట్రంలో మే చివరి వారం లేదా జూన్ మొదటివారానికల్లా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తవుతాయి. అయినా మార్కుల మెమోలను విద్యార్థుల చేతికి అందించేందుకు ఇంటర్ బోర్డు ఏకంగా మూడు నెలల సుదీర్ఘ సమయాన్ని తీసుకుంటున్నది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో లాంగ్ మెమోలను విడుదల చేస్తున్నది. బోర్డు అనుసరిస్తున్న ఈ అలసత్వ ధోరణి విద్యార్థులకు ఇబ్బందులకు తెచ్చి పెడుతున్నది.
'వెరిఫికేషన్' ఇబ్బందులు
ఇంటర్ బోర్డు ఆలస్యం కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీలతోపాటు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ కౌన్సెలింగ్ సమయానికి విద్యార్థుల వద్ద అసలు సర్టిఫికెట్లు అందుబాటులో ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల బోర్డులు మాత్రం ముందుగానే మెమోలు జారీ చేస్తున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఒరిజినల్ లాంగ్ మెమోలను సమర్పించడం తప్పనిసరి. కానీ బోర్డు కాలయాపన వల్ల విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద అధికారులకు సమాధానం చెప్పుకోలేక, ప్రవేశాలు ఎక్కడ రద్దవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. బోర్డు అధికారికంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో, తాత్కాలికంగా షార్ట్ మెమోలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. కొన్ని విద్యాసంస్థలు వీటిని అంగీకరించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కౌన్సెలింగ్ లను దృష్టిలో ఉంచుకొని..
గతేడాది హైదరాబాద్ కు చెందిన విద్యార్థి కి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ లాంగ్ మెమో తప్పనిసరి అని చెప్పడంతో చేసేదేమి లేక ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించి.. వారినుండి క్లారిటీ ఇప్పించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు స్పందించి, పరీక్షల నిర్వహణలో చూపే వేగాన్ని ఫలితాలు, మెమోల జారీలో కూడా చూపించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి కౌన్సెలింగ్ షెడ్యూళ్లను దృష్టిలో ఉంచుకుని, జూన్ లేదా జులై నాటికే లాంగ్ మెమోలను పంపిణీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






