వారెవ్వా.. రంజుగా జగిత్యాల రాజకీయం: కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-05 09:23:59  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వారెవ్వా.. రంజుగా జగిత్యాల రాజకీయం: కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధికారిక అభ్యర్థులకు కాకుండా ఆయన ఏకంగా కాంగ్రెస్ (Congress) రెబల్ అభ్యర్థుల తరఫున ప్రచారానికి దిగడం గందరగోళానికి దారితీసింది. అయితే, నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. కార్యకర్తల ఆత్మగౌరవం ముఖ్యమని ఆయన ఎన్నికల బరిలో ఉన్న రెబల్స్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంజయ్ మళ్లీ యూ టర్న్..

నిన్నటి వరకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar).. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆయన మద్దతుదారులకే మెజారిటీ టికెట్లు దక్కడంపై జీవన్ రెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఈ వింత పోకడలతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు ఎవరికి ఓటు వేయాలో తెలియక సతమతమవుతున్నారు.

కాగా, జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా.. సుమారు 30 టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు దక్కగా, కేవలం 20 టికెట్లు మాత్రమే జీవన్ రెడ్డి అనుచరులకు దక్కాయి. దీంతో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని భావించిన జీవన్ రెడ్డి, తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story