చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధం.. జోజిలా టన్నెల్‌లో ‘ఫైనల్ బ్రేక్‌త్రూ’

by Naga Rani Yarlagadda |

జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను నిత్యం అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మక 'జోజిలా టన్నెల్' ప్రాజెక్టు తుది బ్రేక్‌త్రూకు సర్వం సిద్ధమైంది.

చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధం.. జోజిలా టన్నెల్‌లో ‘ఫైనల్ బ్రేక్‌త్రూ’
X
  • ఈనెల 9న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆవిష్కృతం
  • హిమాలయ పర్వతాల్లో భారత ఇంజినీరింగ్ సంస్థ మేఘా అద్భుతం

దిశ, తెలంగాణ బ్యూరో : జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను నిత్యం అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మక 'జోజిలా టన్నెల్' ప్రాజెక్టు తుది బ్రేక్‌త్రూకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరుకానున్నారు. సుమారు 13.153 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (సముద్ర మట్టానికి 11,578 అడుగులు) నిర్మించారు. ఇది అతి పొడవైన 'సింగిల్-ట్యూబ్' ద్విముఖ రహదారి సొరంగం. భారీ మంచు, హిమపాతాలతో ఏడాదిలో సగం కాలం మూతపడే జోజిలా పాస్‌కు ఈ టన్నెల్ శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో శ్రీనగర్-లడఖ్ మధ్య 365 రోజులపాటు నిరంతర రాకపోకలు సాధ్యమవుతాయి. ఇది పర్యాటక రంగంతో పాటు, సరిహద్దుల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ, న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ సాంకేతికతతో ఎంఈఐఎల్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.

సవాళ్లను అధిగమిస్తూ..

ఈ టన్నెల్ నిర్మాణ కాలంలో కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి. గత ఐదేళ్లలో ఐదు భారీ హిమపాతాలు సంభవించినా నిర్మాణ సంస్థ వెనకడుగు వేయలేదు. టన్నెల్ మార్గంలో రాతి పొరల స్వభావం ఏకంగా 67 సార్లు మారింది. మూడేళ్ల కిందట భారీ హిమపాతంలో చిక్కుకున్న 172 మంది కార్మికులను భారత సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా 1,200 మంది కార్మికులు, ఆధునిక సాంకేతిక పరికరాలతో పనిని కొనసాగించారు. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం.

ప్రాజెక్ట్ హైలైట్స్..

ఈ మొత్తం ప్రాజెక్ట్ పొడవు 30.894 కి.మీ (రోడ్లు, వంతెనలతో కలిపి). వెర్టికల్ షాఫ్ట్‌లు (గాలి ప్రసరణ కోసం), నిల్‌గ్రార్ జంట సొరంగాలు, స్నో గ్యాలరీలు ఈ ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు. అమర్‌నాథ్ యాత్రికుల కోసం పార్కింగ్, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. ఈ ప్రాజెక్టు కేవలం రహదారి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది భారతదేశపు ఇంజినీరింగ్ సామర్థ్యానికి, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story