వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2025 ప్రారంభం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పర్యాటక విధానాన్ని పలు అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు.

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2025 ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పర్యాటక విధానాన్ని పలు అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రపంచ పర్యాటక రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్లూటీఎం) ఎక్సెల్ లండన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్ ఈ నెల 6 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది, "మారుతున్న ప్రపంచంలో ప్రయాణాన్ని పునఃసృష్టిస్తోంది" (రీ ఇన్వెంటింగ్ ట్రావెల్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ ) అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమం, రికార్డు సంఖ్యలో ఎగ్జిబిటర్లు, పెరిగిన ఫ్లోర్ స్పేస్‌తో మునుపెన్నడూ లేనంత పెద్దదిగా మారింది.

రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రాష్ట్రం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, టూరిజం కన్సల్టెంట్‌లు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యాటక రంగంలో తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఈ వేదిక దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, తెలంగాణ టూరిజం శాఖ డబ్లూటీఎంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

ఈ స్టాల్‌ను లండన్‌లోని భారత డిప్యూటీ కమీషనర్ కార్తీక్ పాండే అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ పర్యాటక భవిష్యత్తు కోసం అజెండాను రూపొందించడానికి డబ్లూటీఎం ఒక కీలక వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా, 24 ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తెలంగాణ టూరిజంతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపడం విశేషం. వీరిలో ప్రముఖ ట్రావెల్ మీడియా ప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు, మెడికల్ టూరిజం సంస్థలు ఉన్నాయి. ప్రత్యేక టూరిజం కార్యక్రమాలైన కలినరీ టూరిజం (వంటకాల పర్యాటకం), హాట్ ఎయిర్ బలూన్ పండుగల వంటి అంశాలపై కూడా కీలక సంప్రదింపులు జరిగాయి.

Next Story