- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లోకల్’ రిజర్వేషన్లపై వర్కవుట్ కంప్లీట్.. అధికారులకు కలెక్టర్ల కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది. అనంతరం ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ మరొక జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నేడు ఖరారు..
నేటి సాయంత్రంలోగా రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ సూచించింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో చేయగానే పంచాయతీరాజ్ శాఖ దానిపై ఆదేశాలు జారీ చేస్తుంది. రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలో జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ శ్రీజన ఇప్పటికే అవగాహన కల్పించారు. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఇటీవల చేసిన కులగణన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు ఖరారు చేయాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ప్రాథమికంగా కసరత్తు పూర్తి కావడంతో రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఏ వర్గానికి రిజర్వ్ అయిందో తెలుసుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. రిజర్వేషన్ల విషయం బయట ప్రస్తావించొద్దని, కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.
బీసీలకు 13 జెడ్పీ స్థానాలు
రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు ఉండగా అందులో బీసీలకు 13, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, జనరల్‌కు 10 రిజర్వ్ కానున్నాయి. వీటిలో మహిళలకు 50% కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. దీంతో దాదాపుగా 14 స్థానాలు వారికి దక్కనున్నాయి. రాష్ట్రంలో 565 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎంపీటీసీలు 5763, సర్పంచ్ స్థానాలు 12,760 ఉన్నాయి. వీటన్నింటికి దాదాపుగా రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేశారు. నేడు మరోసారి చెక్ చేసి ఫైనల్ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటిని అధికారికంగా ప్రకటించి జాబితా విడుదల చేస్తారు. వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశముందని సమాచారం. దీపావళిలోపు ఎన్నికలు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతున్నది.
రేపు ‘బీసీ’ జీవో..!
జడ్పీ సీఈవోలు, డీపీవోలతో జిల్లా కలెక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్) కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం జీవో జారీ చేయనుందని హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. జీవో వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను వివరిస్తారు. ఆ తరువాత జనాభా ప్రాతిపదికన కాకుండా డ్రా విధానంలో మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే గెజిట్విడుదల చేస్తారు.
సీట్లు రిజర్వేషన్ ఇలా..
- ‘జెడ్పీ’ రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సీట్ల సంఖ్యను కేటాయిస్తారు. జిల్లాల వారీగా వీటిని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఖరారు చేస్తారు.
- ఎంపీపీల స్థానాలను ఏ వర్గానికి ఎన్ని కేటాయించాలో రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్కమిషనర్ఖరారు చేస్తారు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేయాలో జిల్లా కలెక్టర్నిర్ణయిస్తారు.
- జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ ఫైనల్ చేస్తారు. జిల్లా స్థాయిలో ఏ సామాజికవర్గానికి ఎన్ని స్థానాలు, ఎక్కడెక్కడ రిజర్వ్అవుతాయో తెలుపుతారు
- ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆ జిల్లాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు అనే విషయాన్ని కలెక్టర్ ఖరారు చేస్తారు. ఏ సీటు ఏ వర్గానికి రిజర్వు అవుతుందో ఆర్డీవో నిర్ధారిస్తారు. ఎంపీటీసీలను ఆ మండలంలోని జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ధారిస్తారు.
- పంచాయతీరాజ్చట్టం 2018 ప్రకారం మొదట ఎస్టీలకు, ఆ తరువాత ఎస్సీలకు, బీసీలకు, అనంతరం మహిళలకు సీట్లు రిజర్వు చేస్తారు. ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు.
- పీసా చట్టం (ఏజెన్నీ ప్రాంతాల్లో) అమల్లో ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్విధానం వేరుగా ఉంటుంది.
- సర్పంచ్‌ల రిజర్వేషన్, స్థానాలు ఆర్డీవో ఖరారు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీవోల స్థాయిలో ఫైనల్ అవుతాయి.






