వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌‌పై కసరత్తు

by Malleboina Mahesh |

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌‌పై కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. 2026–27 కు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను శాఖల వారీగా పంపించాలని ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేయాలని సూచించింది. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ఈనెల 23 నుంచి పనిచేస్తుందని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా అన్ని శాఖల వివరాలు ఆర్థిక శాఖకు వచ్చాక.. జనవరిలో డిప్యూటీ సీఎం, ఆర్థిక వ్యవహరాలు చూస్తున్న భట్టి విక్రమార్క ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో భేటీ అయి.. ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై చర్చించనున్నారు.

అన్నింటినీ సమతుల్యం చేస్తూ..

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగుల వేతనాలు, వారికి చెల్లించే బకాయిలు, పీఆర్సీ, కొత్త నియామకాలు ఇలా అన్ని రకాల సమతుల్యంతో బడ్జెట్ ను రూపొందించాలని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం బడ్జెట్ అంచనాల తోపాటుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనా వ్యయాలను కూడా సమర్పించాలని ఆదేశాల్లో సూచించారు. అప్పులు, రుణాలు, వాటికి చెల్లించే వడ్డీలు, ఎఫ్ఆర్ బీఎం పరిధిలోని అంశాలు పొందుపర్చాలని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆయా శాఖల వారీగా ప్రతిపాదించిన బడ్జెట్, ఖర్చు చేసిన వివరాలను నమోదు చేయాలని సూచించారు.

కేంద్ర బడ్జెట్ తర్వాతే తుది రూపం

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని నిధులురానున్నాయి? పన్నుల వాటా బదలాయింపులో భాగంగా ఎన్ని నిధులు వస్తాయనే అన్ని లెక్కలు వేసి రాష్ట్ర బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, 2025-26 వార్షిక బడ్జెట్ ను మార్చి 19న రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం విదితమే.

Next Story