3 రోజులపాటు ధూంధాంగా మ‌హిళా దినోత్సవం

by Muthe.Rajitha |

మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మునుపెన్నడూ జరగని రీతిలో అట్టహాసంగా ప్రపంచ మ‌హిళా దినోత్సవాన్ని ధూంధాంగా నిర్వహించనుంది.

3 రోజులపాటు ధూంధాంగా మ‌హిళా దినోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మునుపెన్నడూ జరగని రీతిలో అట్టహాసంగా ప్రపంచ మ‌హిళా దినోత్సవాన్ని ధూంధాంగా నిర్వహించనుంది. పరేడ్ గ్రౌండ్‌ వేదికగా మార్చి 8వ తేదీన గ్రాండ్​‌గా జరపాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకు మంత్రి సీత‌క్క నేతృత్వంలో సీనియ‌ర్ ఐఏఎస్‌లు అనితా రామ‌చంద్రన్, శైల‌జారామ‌య్యార్, దివ్యదేవ‌రాజ‌న్ తదితరులు క‌మిటీ స‌భ్యులుగా మ‌హిళా దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మూడు రోజులపాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మార్చి 6, 7 తేదీలలో మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన సదస్సు​ను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్​ సౌకర్యం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక శక్తిని ఇచ్చిన వారం అవుతామని అంచనా వేస్తున్నారు.

జీడీపీలో ఉమెన్ భాగస్వామ్యం పెంచేలా చర్యలు

ఆర్థిక, వ్యాపార రంగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచితేనే స‌మ‌గ్రాభివృద్ధి సాధ్యమని సర్కారు ఆలోచన చేస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక రంగంలో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం అధికంగా ఉన్నదని గుర్తించే.. తెలంగాణలో ఆ దిశగా ముందుకెళ్లాలని భావించింది. చైనా, అమెరికా, యూర‌ప్ దేశాల జీడీపీలో మ‌హిళ‌ల కాంట్రిబ్యుష‌న్ 40 శాతానికి పైగా ఉండగా, ప్రపంచ స‌గ‌టు 37 శాతం, మ‌న దేశంలో జీడీపీలో మహిళ‌ల భాగ‌స్వామ్యం కేవ‌లం 18 శాతంగా ఉన్నది. జనాభాలో 50 శాతం ఉన్నా, భార‌త జీడీపీలో మ‌హిళ‌ల పాత్ర అత్యల్పంగా ఉన్నది. అందుకే వ్యాపార‌, ఆర్థిక రంగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెంచేలా తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలకు ఉపక్రమించింది. దీనిపై మంత్రి సీత‌క్క తాను బాధ్యతలు చేప‌ట్టిన నాటి నుంచి మ‌హిళా సాధికార‌త కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మహిళ‌ల‌ను మ‌హాల‌క్ష్మిలను చేసేలా ఆలోచనకు వచ్చి మ‌హిళా దినోత్సవాన్ని మునుపెన్నడూ జరగని రీతిలో ధూంధాంగా నిర్వహించి మహిళలను భాగస్వాములను చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.

వచ్చేనెల 8న మరిన్ని స్కీమ్స్ ప్రారంభం..

మ‌హిళా సంక్షేమం కోసం మార్చి 8న మ‌రి కొన్ని ప‌థ‌కాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ప్రక‌ట‌న చేయనున్నారు. అందులో టీచ‌ర్లకు రూ.2 ల‌క్షలు, హెల్పర్లకు రూ.ల‌క్ష ప‌ద‌వీ విర‌మ‌ణ ప్రయోజ‌నాలు ఉండేలా ప్రణాళికలు చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలు తుది ద‌శ‌లో ఉందని, ఆర్థిక మంత్రి సంత‌క‌ం పూర్తయితే ఆచరణలోకి రానున్నది. ముఖ్యంగా స్వయం స‌హాయ‌క బృందాలకు వ‌డ్డీ లేని రుణాలు(వీఎల్ఆర్) చెక్కుల రిలీజ్, అంగ‌న్‌వాడీ సిబ్బంది, మ‌హిళా సంఘ స‌భ్యుల‌కు చీర‌ల పంపిణీ చేయనున్నారు. అన్ని మేజ‌ర్ రైల్వే స్టేష‌న్లలో స్వయం స‌హాయ‌క సంఘాల స్టాల్, వ‌న్ స్టేష‌న్-వ‌న్ స్టాల్ విధానాన్ని సర్కారు అమలు చేయనున్నది.

బిజినెస్ మోడళ్ల అన్వేషణలో సర్కారు

అన్ని జిల్లాకేంద్రాల్లో మ‌హిళా పెట్రోల్ బంక్, మ‌హిళల‌ను కోటీశ్వరులు చేసే విధంగా ఇత‌ర బిజినెస్ మోడ‌ళ్లను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. గ్యాస్ ఏజెన్సీల‌ను మ‌హిళా సంఘాల‌కు ఇప్పించే యోచ‌న‌లో స‌ర్కారు ఉన్నది. త్వర‌లో అయిల్ కంపెనీల‌తో చ‌ర్చలతో పాటుగా సెర్ప్ ఆద‌ర్శంగా మెప్మా‌ను తీర్చిదిద్దాల‌ని ఆలోచ‌న‌ చేస్తున్నది. మహిళా శక్తి పేరుతో పెద్ద ఎత్తున క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఎంపిక చేసిన మహిళా సంఘాలకు నిథిమ్ ​ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తూ.. ప్రొఫెషనల్ కుక్‌లుగా మారుస్తున్నారు.

సంఘాలన్నీ ఒకే గొడుగు కిందికి..

మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా సెర్ప్​, మెప్మా సంఘాలను అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రతిపాదనలు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి అవసరమైన ప్రణాళికలను తయారుచేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తే వెంటనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మెప్మా పరిధిలో సంఘాల పనితీరుపై, కొత్త సంఘాల ఏర్పాటుపై సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే ఉంది. అయినా కనీస స్థాయిలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కావడం లేదని, వాటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించారు. రెండు వేరు వేరుగా ఉండటం వల్ల సరైన ఫలితాలు రావడం లేదని, సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణంగా గుర్తించారు. రెండింటినీ కలిపి ఒకే ఉన్నతాధికారి, ఒకే రకమైన నిబంధనలు అమలు చేయనున్నారు. మున్సిపల్‌ ​శాఖ నుంచి మెప్మాను వేరు చేసి సెర్ప్, మెప్మాను కలిపి ఒకే శాఖ పరిధిలోకి తీసుకొస్తారు.

Next Story