భగభగమంటున్న ఎండలు.. హైదరాబాద్‌లో తారాస్థాయికి చేరిన ‘తాటి ముంజల’ డిమాండ్!

by Ramesh Naini |

నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో తాటి ముంజలకు డిమాండ్ అమాంతం పెరిగింది.

భగభగమంటున్న ఎండలు.. హైదరాబాద్‌లో తారాస్థాయికి చేరిన ‘తాటి ముంజల’ డిమాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో తాటి ముంజలకు (Ice Apples) డిమాండ్ అమాంతం పెరిగింది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ఈ సహజ సిద్ధమైన పండ్లను ఆశ్రయిస్తున్నారు.

30 ఏళ్లుగా ముంజల వ్యాపారం..

హైదరాబాద్‌లోని ఓ వంతెనపై తాటి ముంజలు విక్రయిస్తున్న నీలం శివరామ్ అనే వ్యాపారి మాట్లాడుతూ తన ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. ‘గత 30 ఏళ్లుగా మా గ్రామానికి చెందిన వారు ఈ వంతెనపైనే తాటి ముంజలు విక్రయిస్తున్నారు. మేము మంచి, తాజా ముంజలను అమ్ముతాము. నగరవాసులు వేసవిలో వీటిని తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో.. ఈ రెండు నెలల పాటు మాత్రమే లభించే పూర్తిగా రసాయన రహితమైన (Chemical-free) ఏకైక ఆహారం ఈ తాటి ముంజలే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ వీటిని కొని తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని శివరామ్ అనే వ్యాపారి జాతీయ మీడియా ఏఎన్ఐ‌తో మాట్లాడారు.

వేసవిలో ముంజలు ఎందుకు తినాలి?

కాగా, తాటి ముంజలు వేసవిలో లభించే అద్భుతమైన, సహజమైన పండ్లు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. వేసవిలో అలసిపోయిన శరీరానికి ఇవి తక్షణమే చల్లదనాన్ని, శక్తిని అందిస్తాయి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎండకాలంలో వచ్చే నీరసం, దాహాన్ని తగ్గించి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఈ సహజమైన పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచివైనప్పటికీ, పరిమితికి మించి (మోతాదుకు మించి) ఎక్కువగా తింటే కడుపు నొప్పి లేదా అజీర్తి చేసే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మితంగా తింటూ వేసవి తాపాన్ని తీర్చుకోవడం ఉత్తమం.

Next Story