- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రివర్గ విస్తరణతో ముసలం.. అశావహులకు బుజ్జగింపులు
మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. మంత్రివర్గంలో అవకాశం రాని నాయకులు ఆసంతృప్తితో పార్టీపై అలకబూనారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధమయ్యారు. మంత్రి పదవులు ఆశించి పదవులు రానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులను పార్టీ నాయకత్వం బుజ్జగించింది. ఏ పరిస్థితుల్లో వారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయిన విషయాన్ని విడమర్చి చెప్పారు. పార్టీ అదిష్టానం సోషల్ ఇంజనీరింగ్కు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా మంత్రి పదవి రాలేదని చెప్పారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని, ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనంత మాత్రానా పార్టీకి పనిచేయనట్లు కాదని, మరో రకంగా కూడా సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. మంత్రి పదవులు రాని వారిని బుజ్జగించడానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు.
మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి, మహేశ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వెళ్లి బుజ్జగించారు. సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి ఇరువురికి సర్దిచెప్పారు. తమ జిల్లాకు ప్రాతినిథ్యం ఇవ్వకపోవడం పట్ల సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో సాయత్రం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా ప్రకటించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి.. మీడియా సమావేశాన్ని రద్దు చేయించారు. సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయన వివాదం కొంత సద్దమణిగిందని సమాచారం. మరో వైపు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం.
మూడు జిల్లాలకు లేని ప్రాతినిధ్యం..
ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా ఇంకా మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో మరోసారి విస్తరణలో ఆ జిల్లాలకు అవకాశం ఉంటుందని ఆశాభావంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడి నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేకపోతున్నామని నాయకులు చెబుతున్నారు. వీరితో పాటుగా మైనార్టీలు, లంబాడలు, మున్నూరు కాపు, యాదవ్ కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రెడ్లకు దక్కని ఛాన్స్
కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ గా గుర్తింపు పొందింది. ఆ పేరు కూడా ఉంది. ఇతర పార్టీలు ఆ పార్టీని రెడ్ల పార్టీగా పిలుస్తూ విమర్శిస్తారు. అదే ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. అయితే ఈసారి మాత్రం రెడ్డి సామాజికవర్గం పట్ల చిన్నచూపు చూశారనే ఆ వర్గం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే అందులో ఒక్కరికి కూడా పదవి ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 26 మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వంలో రెడ్లు ఆరుగురు చొప్పున ఉన్నారు. కానీ కాంగ్రెస్లో ఆ మేరకు మంత్రి పదవులు దక్కడంలేదని వారు అలిగారు. ఇప్పుడు మంత్రి పదవులు రాలేదని అలిగిన వారిలో ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
వివేక్ ఫ్యామిలి ప్యాకేజీ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఒకే టర్మ్లో ఆ కుటుంబంలో కీలక పదవులు లభించాయి. వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కుటుంబం గత రెండు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ప్రస్తుతం వివేక్కు మంత్రివర్గంలో స్థానం దక్కగా ఆయన అన్న వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివేక్ కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఒకేసారి ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఉన్న అతికొద్ది కుటుంబాల్లో వివేక్ కుటుంబం ఒకటని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






