- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారా? ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది? సీపీ సజ్జనార్ ఫైర్
ఇద్దరు యువకులు రెండు బైక్‌లపై వేగంగా వెళ్తుండగా, వారి వెనుక కూర్చున్న వారు దారి పొడవునా రోడ్డుపై డస్ట్ చల్లుతూ వెళ్లారు. ఈ వీడియోపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొంత మంది యువత చేస్తున్న విన్యాసాలు శృతి మించుతున్నాయి. ఫేమస్ అవ్వాలన్న పిచ్చితో సామాన్య ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసేలా ప్రవర్తిస్తున్న వారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో.. ఇద్దరు యువకులు రెండు బైక్‌లపై వేగంగా వెళ్తుండగా, వారి వెనుక కూర్చున్న వారు దారి పొడవునా రోడ్డుపై డస్ట్ (పొడి మట్టి/పౌడర్ లాంటి పదార్థం) చల్లుతూ వెళ్లారు. దీని వల్ల ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయి, వెనుక వస్తున్న వాహనదారులకు కళ్లు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ వీడియో ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. కొందరు ఇది కేవలం 'ఏఐ' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించిన వీడియో అని అభిప్రాయపడుతుండగా.. మరికొందరు ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగినట్లు చెబుతున్నారు.
రోడ్లు మీ స్టంట్లకు వేదికలు కావు: సజ్జనార్
ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న సజ్జనార్ యువకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘లైక్స్, వ్యూస్ కోసం ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది? సమాజం ఏమైపోతోంది? ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారా? వెనుక వచ్చే వారికి కళ్లు కనపడక యాక్సిడెంట్ అయితే ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రోడ్లు మీ సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు’ అని ఆయన హెచ్చరించారు.
మండిపడుతున్న నెటిజన్లు..
ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రజా రహదారులపై చట్టవిరుద్ధమైన చర్యలకు ఇది పరాకాష్ట. రద్దీగా ఉండే మార్కెట్లలో ఇలా దుమ్ము చల్లుతూ భయాందోళనలు సృష్టించడం యువత లక్షణం కాదు, ఇది నేరపూరితం. అధికారులు మౌనంగా ఉంటే ఇలాంటి ప్రవర్తన మరింత పెరుగుతుంది. వారి వాహనాలను సీజ్ చేసి, భారీ జరిమానాలు విధించినప్పుడే వీరికి బుద్ధి వస్తుంది’ అని ఒక నెటిజన్ డిమాండ్ చేశారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులకు బైక్‌లు ఎవరు ఇస్తారు? ఇప్పటికే దేశమంతా వాయు కాలుష్యం, దుమ్ముతో పోరాడుతుంటే, వీరు ఉద్దేశపూర్వకంగా రోడ్ల మీదికి ఇలాంటి డస్ట్‌ని వెదజల్లడం దారుణం. వీరికి కనీస పౌర స్పృహ లేదు. ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం పట్టింపు లేదు. ఇలాంటి చర్యలు పర్యావరణాన్ని మరింత నాశనం చేస్తాయి’ అని మండిపడ్డారు.






