విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా? కవిత వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత కీలక డిమాండ్

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, తదితర అంశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా? కవిత వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత కీలక డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, తదితర అంశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చాలా మొండిదాన్ని.. మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలు పగలగొట్టి.. ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తాము అని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవిత మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. ‘విగ్రహాలు పగలగొట్టాలని మాట్లాడితే ముఖ్యమంత్రి అవుతారా, కవిత గారు? ఇంకెన్నాళ్లు మీరు ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ నేత బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో విద్వేషం, ఉద్రిక్తతలు పెంచేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కదా అని నిలదీసిన ఆయన.. ఈ వ్యవహారంపై తెలంగాణ డీజేపీ, సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

జనసేన సభకు అనుమతి నిరాకరణపై బీజేపీ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఏపీ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఒక రాజకీయ పార్టీ హాల్‌లో సమావేశం నిర్వహిస్తే అభ్యంతరం ఎందుకు?’ అని తెలంగాణ డీజేపీని నేరుగా ప్రశ్నించారు. జనసేన క్రియాశీల కార్యకర్తల సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పౌర స్వేచ్ఛలను అణచివేయడం అన్యాయమని, వెంటనే పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎంవోను ఆయన డిమాండ్ చేశారు.

Next Story