- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జల జగడానికి ఎండ్ కార్డ్ పడేనా..! నేడు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కీలక భేటీ
రాష్ట్ర విభజన తర్వాత నుంచి కృష్ణా, గోదావరి నదుల జల వాటాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర విభజన తర్వాత నుంచి కృష్ణా, గోదావరి నదుల జల వాటాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఇవాళ మధ్యాహ్నం 2.30కి కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయంలో, సీఆర్ పాటిల్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారు. అధికారుల విభాగంలో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ క్రిష్ణారావు, నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర నీటి పారుదల శాఖ అధికారులు హాజరవుతారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, నీటి పారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ అధికారులు అంటెండ్ అవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పాత్రే కీలకం..
ఈ భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదుల జల వాటాలు, ప్రాజెక్టుల ఆమోదం, మరియు కేంద్ర ఆర్థిక సహాయంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. అయితే, గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపైనే సమావేశంలో చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా.. అసలు బనకచర్లపై చర్చే అవసరం అవసరం లేదని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. రెండు రాష్ట్రాలు తమ తమ డిమాండ్లపై పట్టుబడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయ పాత్ర కీలకంగా మారనుంది.
తెలంగాణ సర్కార్ కీలక డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఏపీ వాదిస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది గోదావరి జల వివాద ట్రిబ్యునల్,ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను హరిస్తుందని ఆరోపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి అంగీకరించేది లేదని, ఆ అంశాన్ని అసలు ఎజెండా నుంచి తొలగించాలని కేంద్రానికి లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో కృష్ణా నది జలాల్లో తమకు రావాల్సిన 299 టీఎంసీల నీటి కోటాను సాధించడంలో విఫలమైందని, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలను యథేచ్ఛగా మళ్లించుకుందని ఆరోపించింది. కృష్ణా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, టెలిమెట్రీ పరికరాలు అమర్చి నీటి వినియోగాన్ని ఖచ్చితంగా కొలమానాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదేవిధంగా పాలమూరు, దిండి, ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా, 80 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడికుంట వాగు, చనాఖా కొరటా బ్యారేజీ, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు సత్వర ఆమోదం తెలపాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఖర్చుల రీయింబర్స్‌మెంట్, ఎడమ-కుడి కాలువల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని కోరింది. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీటి సరఫరా కోసం బనకచర్ల ప్రాజెక్టును ఆమోదించాలని కోరింది.






