బడ్జెట్ ముంగిట దేవాదుల.. నిధుల వరద పారేనా?

by Kema Shiva Kumar |

తెలంగాణలో రెండున్నర దశాబ్దాలుగా సాగుతున్న దేవాదుల ఎత్తిపోతల పథకం వ్యయం మూడు రెట్లు పెరిగి రూ. 18,500 కోట్లకు చేరగా, ఇంకా 9 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది.

బడ్జెట్ ముంగిట దేవాదుల.. నిధుల వరద పారేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గోదావరి జలాలను ఎత్తైన ప్రాంతాలకు అందించాలనే మహత్తర లక్ష్యంతో ప్రారంభమైన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరోసారి బడ్జెట్ సీజన్‌లో చర్చల కేంద్ర బిందువుగా మారింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశకు దారితీస్తున్నది. ఏటా బడ్జెట్ సమయంలో భారీ కేటాయింపులపై హామీలు వినిపిస్తున్నా.. పనుల పురోగతి మాత్రం ఆశించినంత వేగంగా సాగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి నదిలో లభ్యమయ్యే వరద జలాలను వినియోగించి వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి ఎత్తైన జిల్లాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నీటిని పలు దశల్లో ఎత్తిపోతల ద్వారా పైభాగాలకు తరలించే విధంగా రూపకల్పన చేసిన ఈ పథకం సాంకేతికంగా క్లిష్టమైనది. భారీ పంప్ హౌసులు, సుదీర్ఘ పైప్‌లైన్లు, కాల్వల నిర్మాణం, పంపిణీ వ్యవస్థలతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఇది ఒకటి.

లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు..

ప్రాజెక్టు ద్వారా సుమారు 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం కొన్ని సమీప ప్రాంతాలకు మాత్రమే నీరు అందుతుండగా, మిగిలిన ఎత్తైన మండలాల రైతులు ప్రాజెక్టు పూర్తవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వర్షాధార వ్యవసాయం ప్రధానంగా ఉండటంతో, దేవాదుల నీరు అందితే రెండో పంట వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాగునీరు అందడం వల్ల భూగర్భ జలాల స్థాయి మెరుగుపడుతుంది. దేవాదుల ప్రాజెక్టు ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భూసేకరణ సమస్యలు పనులను గణనీయంగా ప్రభావితం చేశాయి. మూడో దశలో అవసరమైన భూముల సేకరణ పూర్తికాకపోవడంతో పైప్‌లైన్, పంపిణీ వ్యవస్థ పనులు నిలిచిపోయాయి. అదనంగా సాంకేతిక ఇబ్బందులు, కాంట్రాక్టు మార్పులు, నిధుల కొరత వంటి అంశాలు కూడా పనుల వేగాన్ని తగ్గించాయి. గత నాలుగేళ్లుగా కీలక దశలో పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.

మూడు రెట్లు పెరిగిన వ్యయం..

ప్రారంభంలో రూ.6,016 కోట్ల అంచనాతో ఆమోదం పొందిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం సుమారు రూ.18,500 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఆలస్యం కారణంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, భూసేకరణ ఖర్చులు అధికమవడం, సాంకేతిక మార్పులు చేయాల్సి రావడం, విద్యుత్ ఖర్చులు పెరగడం వంటి అంశాలు వ్యయాన్ని గణనీయంగా పెంచాయి. ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు చేసి సుమారు 91 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 9 శాతం పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.4,312 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేస్తున్నది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాజెక్టు జాప్యం కొనసాగితే భవిష్యత్తులో అంచనాలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. నిధుల విడుదల ఆలస్యమైతే కాంట్రాక్టు సవరణలు, ధరల పెరుగుదల కారణంగా మరోసారి వ్యయభారం పెరిగే అవకాశం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.

సీఎం సమీక్ష.. కొత్త ఆశలు..

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం స్థాయిలో సమీక్ష జరగడం ప్రాజెక్టు పురోగతికి మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే.. రైతులు మాత్రం ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు వినిపిస్తున్నాయని, ఆచరణలో మాత్రం పనులు మందగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్‌పైనే అందరి దృష్టి..

ప్రస్తుతం అందరి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే కనిపిస్తున్నది. మిగిలిన పనులు పూర్తి చేయాలంటే తక్షణమే రూ.4,312 కోట్ల విడుదల అవసరమని ఇంజినీరింగ్ వర్గాలు సూచిస్తున్నాయి. ఒకేసారి పూర్తిస్థాయి నిధులు విడుదల చేస్తేనే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే పరిమిత కేటాయింపులతో మరోసారి జాప్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 91 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు చివరి దశలో నిలిచిపోవడం రాష్ట్రానికి కూడా ఆర్థిక భారంగా మారుతున్నది. పూర్తికాని ప్రాజెక్టుపై ఇప్పటికే భారీగా ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో పూర్తిస్థాయి కేటాయింపులు చేసి ప్రాజెక్టును పూర్తిచేస్తారా? లేక మరోసారి పరిమిత నిధులతో సరిపెడతారా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో, రైతుల్లోనూ చర్చనీయాంశమైంది.

Next Story