- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలిటెక్నిక్ కాలేజీలకు ఇంజినీరింగ్ హోదా దక్కేనా?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఇంజినీరింగ్ కళాశాలల హోదా కల్పించాలనే ప్రతిపాదనపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఇంజినీరింగ్ కళాశాలల హోదా కల్పించాలనే ప్రతిపాదనపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా ఉన్నప్పటికీ, సాంకేతిక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియ మందగించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ సంస్థలను అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి(ఎస్‌బీటీఈటీ) ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, పాలిటెక్నిక్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సామర్థ్యం పెరిగి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి వస్తుంది. తొలిదశలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ సంస్థలను పూర్తిస్థాయి ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు
ఈ ప్రతిపాదనను పరిశీలించి, జేఎన్టీయూ అధికారులు అఫిలియేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సాంకేతిక విద్యా శాఖ ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. గతేడాది అప్‌గ్రేడ్ కానున్న కళాశాలలకు జేఎన్టీయూ నుంచి అప్లియేషన్ పొందే ప్రక్రియపై అధికారులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రాత్రికి రాత్రే జేఎన్టీయూ అఫిలియేషన్ ప్రక్రియను సాంకేతిక విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆపేయడంపై కారణాలు ఏంటనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా అధికారులు ఈ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను అడ్డుకుంటున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అప్‌గ్రేడ్ కానున్న కాలేజీలు
అప్‌గ్రేడ్ కానున్న కాలేజీల్లో ఈస్ట్ మారేడ్‌పల్లిలోని మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఖులీ ఖుతుబ్ షా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, రామంతపూర్‌లోని జేఎన్ పాలిటెక్నిక్ కాలేజ్, బడంగ్‌పేట్‌లోని మహిళా పాలిటెక్నిక్(మైనారిటీలు), అమీర్‌పేట్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థలు ఉన్నాయి. ఇందులో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీని అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి సీతక్క దృష్టికి వెళ్లడంతో ఫైల్ ప్రాసెస్ చేసి సీఎంఓకు పంపించారు. ఫిసిబిలిటీ రిపోర్టును మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా సీఎంవో అధికారులకు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నా, క్షేత్రస్థాయిలో అధికారుల చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల జాప్యం కారణంగా పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడ్ అంశం ముందుకు కదలక, ఇంజినీరింగ్ హోదా దక్కే అంశం ప్రశ్నార్థకంగా మారింది.






