- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleswaram commission: కేసీఆర్ వర్సెస్ ఈటల.. మధ్యలో హరీశ్ రావు! కాళేశ్వరం నోటీసుల వేళ హైవోల్టేజ్ పాలిటిక్స్
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) విచారణ పొలిటికల్ మంటలు పుట్టిస్తోంది. విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీమంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh) నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ డ్రామా నడుస్తున్న వేళ తాజాగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. నోటీసులు అందుకున్న నేతలు బీఆర్ఎస్, బీజేపీకి చెందినవారు కావడంతో ఈ పొలిటికల్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న అంశం ఉత్కంఠగా మారింది.
ఆరోపణలకు చెక్ పెడతారా?..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ (KCR) హాజరు సస్పెన్స్‌గా మారింది. 15 రోజుల్లో విచారణకు రావాలని కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో గులాబీ బాస్ వ్యక్తిగతంగా హాజరవుతారా? లేదా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమిషన్ పలువురు అధికారులు, మాజీ అధికారులు, నిపుణులను విచారించింది. అయితే అందరూ కేసీఆర్ నిర్ణయాలనే తాము పాటించామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణకు రావాలని విద్యుత్ కమిషన్ నోటీసులు ఇవ్వగా కేసీఆర్ హాజరుకాలేదు. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ ఆ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే తాజా నోటీసులపై ఇదే రకంగా లేఖ రాసి సరిపెట్టే ప్రయత్నం చేస్తారా? లేక వ్యక్తిగతంగా హాజరై తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెడతారా అనేది వేచి చూడాలి.
ఈటల వర్సెస్ కేసీఆర్.. మధ్యలో హరీశ్..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్, విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ జరిపాయి. ఇందులో ఆర్థిక అవకవతకలు ఉన్నాయని కాగ్, డీపీఆర్‌కు భిన్నంగా బ్యారేజీల నిర్మాణం జరిగిందని ఎన్డీఎస్ఏ తమ నివేదికలో పేర్కొన్నాయి. ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ విచారణలోనూ అందరి వేళ్లు కేసీఆర్ వైపే చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్‌తోపాటు ఆ సమయంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు (Harish Rao), ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌ను (Eatala Rajender) విచారించి వారి అభిప్రాయాలను కమిషన్ తెలుసుకోబోతున్నది. అయితే ఈ ముగ్గురి స్టేట్‌మెంట్‌తో ఈ కేసు కీలక మలుపు తీసుకునే అవకాశాలు లేకపోలేదనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య విభేదాలు తలెత్తాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేసీఆర్‌కు హరీశ్‌రావుకు మధ్య క్లాషెస్ ఏర్పడ్డాయనే టాక్ వినిపిస్తుండగా, మరోవైపు కేసీఆర్ తనను అవమానించిన తీరును ఈటల మర్చిపోలేకపోతున్నారనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో కమిషన్ ముందు ఒకే వాదన వినిపిస్తారా? లేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొన్నది.






