హైదరాబాద్‌కు మంత్రి బెర్తు దక్కుతుందా?

by Gantepaka Srikanth |

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోమారు హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారు? అసలు ఈ సారైనా జిల్లాకు బెర్త్ దక్కుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌కు మంత్రి బెర్తు దక్కుతుందా?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోమారు హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారు? అసలు ఈ సారైనా జిల్లాకు బెర్త్ దక్కుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ అంటే తెలంగాణ గుండెకాయ. తరచుగా దేశ రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ వినబడే నగరం. ఇంతటి ఖ్యాతి ఉన్న హైదరాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పాటు సమయంలో చోటు దక్కకపోవడం, ఇప్పుడు ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు పలు మంత్రి పదవులు దక్కాయి. తలసాని, మహమూద్ అలీ మంత్రులుగా పని చేశారు. అయితే మహమూద్ అలీ ఎమ్మెల్సీగా ఉండి పదవిని దక్కించుకోగా.. సనత్‌నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గత మంత్రి వర్గంలో కీలకంగా పని చేసిన విషయం తెలిసిందే.

విస్తరణలో జిల్లాకు మొండి చెయ్యేనా..?

రాష్ట్ర మంత్రివర్గంలో మరో నలుగురు మంత్రులుగా రెండో విడత పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే అందులో కూడా హైదరాబాద్ జిల్లాకు చోటు దక్కే అవకాశం కనబడడం లేదు. సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ జిల్లానే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో జిల్లాకు చోటు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. ఖాళీ అయిన కంటోన్మెంట్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దక్కించుకుంది. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడమే కాదు.. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలు కావడంతో అప్పటి నుంచి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన మాట మార్చి బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్న పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసలు ప్రాతినిథ్యం లేకుండా పోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌కు కీలక ప్రాధాన్యత ఉండేది. 2018 ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ పద్నాలుగు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అధికార పార్టీకి గ్రేటర్‌ పరిధిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆయన మొదటి సారి ఎన్నిక కావడంతో ఆయనకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. దీంతో ఎమ్మెల్సీల్లో ఎవరికైనా మంత్రి వర్గంలో బెర్త్ దక్కుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఓటమి పాలైన అగ్రనేతలు..

గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, డాక్టర్ రోహిన్ రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, విజయారెడ్డి, ఆదం సంతోష్ కుమార్, పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హన్మంతరావు వంటి పెద్ద నాయకులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో ఎవరు గెలిచినా మంత్రి పదవి అప్పట్లోనే దక్కి ఉండేదనే టాక్ అంతటా వినిపించింది. సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం కల్పించేలా అధికార పార్టీ సమీకరణాలు ఉంటాయి. రాష్ట్రంలో కనీసం ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ప్రాతినిథ్యం దక్కుతుంది. ఈ నేపథ్యంలో తాజా మంత్రి వర్గ విస్తరణ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నది.

చట్ట సభల్లో సభ్యులు కాకున్నా..?

ఎమ్మెల్యేగా గెలుపొందని నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆరు నెలల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. గతంలో పలువురు ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానప్పటికీ ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు దీనిని ఉదాహరణగా చూపిస్తూ హైదరాబాద్ నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎలాగైనా మంత్రి పదవి దక్కితే ఆరు నెలల్లో ఏదో రకంగా పార్టీనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని, చట్ట సభల్లో సభ్యులు కాకున్నా మంత్రి పదవిపై కన్నేసిన పలువురు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో హైదరాబాద్ ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story