- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పాపం హరీశ్‌రావు.. ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (government whip Aadi Srinivas) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తాజాగా సీఎల్పీలో మీడియా మాట్లాడారు. కవిత మాటల పైన ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్పందించలేదని, దెయ్యాలు, కోవర్టుల గురించి నోరు మెదపడం లేదని అన్నారు. హరీశ్‌రావుకు దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని హరీశ్‌రావు (Harish Rao) చెబుతున్నారని, పాపం హరీశ్‌రావు .. చాలా అమాయకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేదని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వయంగా కేసీఆర్ కూతురే బయటపెట్టారని వివరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధాన్ని కవిత సాక్ష్యాలతో సహా బయట పెట్టిందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయం.. సరైన సయమంలో ఇద్దరు ఒకటై పోతారు.. ఈటల రాజేందర్ మధ్యవర్తిగా వ్యవహారం జరుగుతుందనే ప్రచారం ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మిగలదని ఆరోపించారు. హరీశ్‌రావు మాత్రం పొత్తులు లేవని బీఆర్ఎస్ క్యాడర్ మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారని అన్నారు. పొత్తుల గురించి మాట్లాడటానికి హరీశ్ రావు ఎవరు? ఆయనకు బీఆర్ఎస్ ఉన్న పాత్ర ఏమిటి? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు మాత్రమే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మాత్రమే లీడర్లని తేల్చారని, హరీశ్‌రావు ఫోటో కూడా రజతోత్సవ సభలో పెట్టలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పకుండా హరీశ్‌రావు ఎందుకు పొత్తులపై ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు.
కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. రుణమాఫీ చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు దొంగ సవాల్ చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల వారీగా లెక్కలు ఉన్నాయని, కావాలంటే ఆయనకు ఇస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా జాబితా ఇచ్చాం.. ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఈ లిస్ట్ ఉందన్నారు. రైతులకు ఎవరు ఏమీ చేశారో హరీశ్‌రావుతో బహిరంగ చర్చకు మేం సిద్ధం.. అని సవాల్ విసిరారు.






