- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST Reforms: ట్రంప్ సుంకాల వేళ ఇప్పుడే జీఎస్టీ సంస్కరణలు ఎందుకు?.. మోడీ ప్రకటనపై రాజకీయ చర్చ
జీఎస్టీపై ప్రధాని మోడీ చేసిన ప్రకటన దేశ ప్రజల్లో చర్చనీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శుభవార్త చెప్పారు. ఈ దీపావళికి ప్రజల సంతోషాన్ని రెట్టింపు చేసేలా జీఎస్టీలో భారీ సంస్కరణలు (GST Reforms) తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఎర్రకోట వేదికగా మోడీ తన స్పీచ్ లో ఈ సంస్కరణ అంశం ప్రస్తావించడంతో జీఎస్టీలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు రాబోతున్నది? దాంతో తమకెలాంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయని ఇటు వ్యాపారా వాణిజ్య రంగంలో అటు దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. నిజానికి జీఎస్టీలో మార్పులు తీసుకువచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం గతం నుంచే కసరత్తు చేస్తోంది. అయితే ఇటీవల భారత్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించడం రాజకీయంగాను ఇంట్రెస్టింగ్ గా మారింది. దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చి నిత్యావసర ధరలు తగ్గించేందుకు శ్రీకారం చుట్టడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఉపాధి రంగంపై భారీగా దెబ్బ:మన దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో జీఎస్టీ అతిపెద్ద సంస్కరణ. వస్తుసేవల రంగంలో సెంట్రల్, స్టేట్ విధిస్తున్న బహుళ పరోక్ష పన్నుల స్థానంలో ఒకే ట్యాక్స్ గా జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 2017 జులై 1న ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జీఎస్టీ కేంద్రానికి, రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ జీఎస్టీ అమలులోకి వచ్చి ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తయింది. కానీ జీఎస్టీ సెటిల్మెంట్ లో ఆశించినంత స్థాయిలో తమకు రావాల్సిన వాటా తమకు రావడం లేదని రాష్ట్రాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇక మోడీ సర్కార్ ను ప్రతిపక్షాలు కార్నర్ చేసే విషయంలో జీఎస్టీ ఓ ప్రధానాస్త్రంగా మారుతోంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ 8 ఏళ్ల తర్వాత కూడా పరిశీలిస్తే ఇదే పన్ను సంస్కరణ కాదని ఇది ఆర్థిక అన్యాయానికి, కార్పొరేట్ స్నేహపూర్వక విదానాలకు ఉపయోగపడే క్రూరమైన ఆయుధం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశంలో ఎక్కువ మంది ఉపాధి పొంతున్నMSME లు (చిన్న, మధ్య తరహా వ్యాపారాలు)ఈ జీఎస్టీ వల్ల ఎక్కువ దెబ్బతిన్నాయనే విమర్శు వినిపిస్తున్నాయి. జీఎస్టీ అమలు అయ్యాక గత ఎనిమిదేళ్లలో18 లక్షల పైగా ఎంఎస్ఎంఈలు మూతపట్టాయని ప్రతిపక్షాల ఆరోపణ. కేరమెల్ పాప్‌కార్న్ నుంచి క్రీమ్ బన్ల వరకు అన్నీంటిపై జీఎస్టీ విధించడం వల్ల ప్రజలు ధరల భారాన్ని మోయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ జీఎస్టీ సామాన్యుల కంటే కూడా బడా కార్పొరేట్లకు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయనే టాక్ ఉంది. ప్రజలు ఇప్పుడు టీ నుంచి హెల్త్ ఇన్షూరెన్స్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ చెల్లిస్తుంటే కార్పొరేట్లు భారీగా పన్ను రాయితీ పొందుతున్నారనే విమర్శ ఉంది. ఈ క్రమంలో జీఎస్టీలో సంస్కరణలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దీపావళి నుంచి మార్పులు చేస్తామని ప్రకటించింది.
ఇకపై రెండు స్లాబులే:
మోడీ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే జీఎస్టీపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ లో కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో మూడు రకాలుగా సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. స్ట్రక్చరల్ రీఫార్మ్స్, రేట్ రేషనలైజేషన్, ఈజ్ ఆఫ్ లివింగ్ పై ఫోకస్ పెట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం ఉన్న నాలుగు జీఎస్టీ పన్నుల శ్లాబులను కుదించి రెండు శ్లాబులకు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ సిఫార్సు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సిఫార్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంస్కరణల ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందేలా వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
తగ్గనున్న నిత్యావసర ధరలు!
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల నిత్యావసర ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా కాలంగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్న జీవిత బీమా, ఆరోగ్య బీమా జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మంత్రుల కమిటీ సైంత కేంద్రానికి సిఫార్సు చేసినట్లు గతంలో కథనాలు వచ్చాయి. జీఎస్టీ భారంతో ప్రీమియం తడిసి మోపెడు అవుతున్నదని దీని కారణంగా దేశంలో అనేక మంది ప్రజలు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్సులకు దూరం అవుతున్నారు. ఈవిషయంలోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించడంతో ఏయే వస్తువులు మేరకు తగ్గబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.






