జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ పోరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 02:06:12  IST  )

మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ పోరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రాష్ట్ర ప్రజల్లోనూ ఆ ఆసక్తి కనిపిస్తుండగా.. పార్టీల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తున్నది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ఇరు పార్టీల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తున్నది. ప్రజలు తమవైపే మొగ్గు చూపారని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గెలుపు కోసం ఈ రెండు పార్టీలు ఆశగా ఎదురుచూస్తుండగా.. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ బీజేపీ నేతల్లో కనిపిస్తున్నది.

జోరుగా బెట్టింగులు..

మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక నియోజకవర్గానికి సంబంధించినదే అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలో ఫలితం ఎవరికి అనుకూలంగా రాబోతున్నదన్న చర్చ జరుగుతున్నది. ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగగా అదే స్థాయిలో జోరుగా బెట్టింగ్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారని.. లేదు లేదు బీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తారని.. ఇలా ఇరు పార్టీల మీద పందెం రాయుళ్లు బెట్టింగులు పెట్టారు. ఈ బెట్టింగులు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ ఈ ట్రెండ్ కొనసాగింది.

గెలుపు ధీమాలో కాంగ్రెస్..

జూబ్లీహిల్స్​ఉపఎన్నికలో తాము విజయం సాధిస్తామన్న ధీమాలో కాంగ్రెస్​ఉన్నది. పోలింగ్​జరిగిన తీరును విశ్లేషిస్తూ అంతా కూడా తమకు అనుకూలంగా ఉందన్న అంచనాలో హస్తం నేతలున్నారు. తమ అంచనా ప్రకారం 18 వేల నుంచి 25 వేల మెజార్టీతో జూబ్లీహిల్స్‌లో గెలుస్తామని కాంగ్రెస్​నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ సైతం దాదాపు అన్నీ కూడా కాంగ్రెస్​గెలుస్తుందని చెప్పడంతో హస్తం నేతల్లో విజయంపై ధీమా మరింత పెరిగింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రులు, నేతలను సమన్వయ పరుస్తూ సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. సీఎం ప్రతి డివిజన్‌లో కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో ప్రచారం నిర్వహించారు. దీంతో పాటు నేతలంతా సమన్వయంతో పనిచేశారు. అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గంలో ప్రతి గల్లీ, బస్తీని చుట్టివచ్చారు. మిత్రపక్షాలు ముఖ్యంగా మజ్లీస్​పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఇటు వామపక్షాలు, తెలంగాణ జనసమితి పార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా పబ్లిక్ టాక్‌ను తీసుకురావడంలో హస్తం నేతలు విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

బీఆర్ఎస్‌లో ఓ వైపు ధీమా.. మరోవైపు టెన్షన్

ఇక.. బీఆర్ఎస్ పార్టీ నేతల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఓవైపు గెలుపు తమదే అన్న ధీమా నేతల్లో కనిపిస్తున్నప్పటికీ మరోవైపు ఓటమి టెన్షన్ సైతం వారిని వెంటాడుతున్నది. గెలుపుపై ఏ స్థాయిలో భరోసాతో ఉన్నారో.. అదే స్థాయిలో ఓటమి భయం సైతం వారిని వదిలిపెట్టడం లేదు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఫలితం తారుమారు అయితే భవిష్యత్‌లో పార్టీ భవిష్యత్ ఏంటన్న భయం ముఖ్యనేతల్లో కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగానూ బీఆర్ఎస్ బలగాన్ని ఇక్కడే మోహరించారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు.. భవిష్యత్‌లో కేసీఆర్ సీఎం కావడానికి ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్ రెఫరెండంగానూ పెట్టుకుంది. ఇదే అంశాన్ని స్వయానా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారాల్లో చెప్పారు. అందుకే ఈ ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. ఆ స్థాయిలో కష్టపడటంతో గెలుపు తమ వైపే ఉంటుందన్న ధీమా వారిలో కనిపిస్తున్నది. అదేస్థాయిలో ఓడిపోతే పార్టీని, కేడర్‌ను కాపాడుకునేది ఎలా అనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అసలే ముందు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు సైతం ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఫలితం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఫలితం రివర్స్‌గా వస్తే కేడర్ చేజారి పోయే ప్రమాదం ఉందన్న భయం వారిని వెంటాడుతున్నది.

బీజేపీకి డిపాజిట్ దక్కేనా!

ఉపఎన్నిక ఫలితాలపై అటు కమలనాథుల్లోనూ టెన్షన్​వాతావరణం కనిపిస్తున్నది. కనీసం డిపాజిట్​అయినా దక్కుతుందా? అనే అనుమానం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నది. ఒకవేళ డిపాజిట్ కోల్పోతే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన పెద్దలను వేధిస్తున్నది. ఎన్నికల్లో ప్రచారం సక్రమంగా చేయకపోవడంతో పలుచోట్ల స్థానిక నేతలు రాష్ట్ర నేతల పోకడలపై నిలదీశారు. ఈ విధంగా ప్రచారం చేస్తే భవిష్యత్‌లో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్​డిజిట్​సీట్లకే పరిమిత కాకతప్పదని పలు సభల్లో హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల నుంచి గెలుపు బాటలో నడిచిన బీజేపీ ఏడాది క్రితం జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి పార్టీకి ఢోకా లేదని శ్రేణులు భావించారు. తాజాగా ఎగ్జిట్​పోల్​సర్వేలన్నీ బీజేపీకి డిపాజిట్​రావడం కష్టమని వెల్లడించాయి. దీంతో పార్టీ నేతల్లో నిరాశ కనిపించింది. ఇక ఈ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని కేడర్ కుమిలిపోతున్నది. మరోవైపు.. రాష్ట్ర సారథిగా రాంచందర్‌రావు పగ్గాలు చేపట్టిన తరువాత వచ్చిన మొదటి ఎన్నిక కావడంతో ఆయన పనితీరునూ లెక్కించాల్సి వస్తున్నది. పార్టీ బలం రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఇతర పార్టీల నుంచి వలస వచ్చి నేతల్లో గుబులు మొదలైంది. ఈ విధానంతో పార్టీ ముందుకు వెళ్లితే తెలంగాణలో అధికారం చేపట్టడం కలగానే మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​పార్టీలపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను క్యాష్​చేసుకోలేకపోయిందని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడే కరువయ్యారని చెబుతున్నారు. ఇంకా ఆ పార్టీలో ఎంతకాలం కొనసాగాలనే అంశాలపై తర్జనభర్జన పడుతున్నారు.

Read More..

Jubilee Hills result: జూబ్లీహిల్స్ ఫలితం.. 'లోకల్' లీడర్లలో ఉత్కంఠ

Next Story