ఖాళీలపై వైట్ పేపర్ ఏది? జాబ్ క్యాలెండర్ ఏది? రేవంత్ సర్కార్‌పై దాసోజు ఫైర్

by Ramesh Naini |

యువతకు ఉద్యోగం ఒక వ్యక్తిగత అవసరం మాత్రమే కాదు, అది వ్యవస్థకు అవసరమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ కుమార్ ​పేర్కొన్నారు.

ఖాళీలపై వైట్ పేపర్ ఏది? జాబ్ క్యాలెండర్ ఏది? రేవంత్ సర్కార్‌పై దాసోజు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : యువతకు ఉద్యోగం ఒక వ్యక్తిగత అవసరం మాత్రమే కాదు, అది వ్యవస్థకు అవసరమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ కుమార్ ​పేర్కొన్నారు. ఒక యువకుడు ఉద్యోగస్థుడైతే అతను వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామి అవుతాడని, రాష్ట్ర అభివృద్ధికి ఇంధనంగా తోడ్పడతాడని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన నిరుద్యోగ రౌండ్ ​టేబుల్​ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పాలకులు ఉద్యోగ కల్పనను వ్యక్తిగత సమస్యగా కాకుండా రాష్ట్ర బలోపేతానికి అవకాశంగా చూడాలనే దృక్పథంతో పాలసీ నిర్మాణం జరగాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని పట్టణ నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కానీ స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి చేయాలి.. ఏమి చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. అభయహస్తం మేనిఫెస్టోలో, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ప్రియాంక గాంధీ స్వయంగా ప్రకటించిన వాగ్దానాలు జాడ లేదన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించే కంపెనీలు రావడం లేదు.. ఫార్మాసిటీని రద్దు చేసి 50 వేల ఉద్యోగాలు పోగొట్టారు.. నిరుద్యోగం, నిరాశ, ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి పాలన ఫలితమని దాసోజు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల వివరాలు ప్రకటించాలి.. హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగ సంపద సృష్టించలేని ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలన్నారు. ఉద్యోగం రావాలంటే రేవంత్ పోవాలి ఈ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలని, నిరుద్యోగులు తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.

Next Story