అడ్వైజరీ ప్యానెల్‌లో తెలంగాణ బిడ్డలకు చోటేది? మాజీ ఎంపీ బీ.వినోద్‌ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టారని.. ఈ మీటింగ్‌లో రెండు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆరోపించారు.

అడ్వైజరీ ప్యానెల్‌లో తెలంగాణ బిడ్డలకు చోటేది? మాజీ ఎంపీ బీ.వినోద్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టారని.. ఈ మీటింగ్‌లో రెండు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఎంపీ బీ. వినోద్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ వ్యవహారాన్ని చూస్తుందని సీఎం చెప్పారని.. ఇందుకోసం అడ్వయిజరీ ప్యానెల్‌ను సైతం ప్రకటించారని తెలిపారు. ఇందులో మోహన్ గురు స్వామి తప్ప తెలంగాణ వారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదన్నారు. 30 మందిలో తెలంగాణ బిడ్డలకు ఎందుకు చోటు ఇవ్వలేదని ప్రశ్నించారు. అడ్వైజరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారంతా వర్చ్యువల్‌గా మీటింగ్‌లకు హాజరయ్యే వారేనని.. సోనియా గాంధీ గతంలో ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో సైతం ఇద్దరు తెలంగాణ బిడ్డలు హనుమంతరావు, జయప్రకాష్ నారాయణ్ ఉండేవారని తెలిపారు.

అమెరికాలో సైతం తెలంగాణ బిడ్డలు ఆ గవర్నమెంట్‌కు సలహాదారులుగా ఉన్నారని.. అనేక దేశాల్లో ఆయా ప్రభుత్వాలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో తెలంగాణ బిడ్డలకు ఇప్పటికైనా స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ విడుదల చేశాక కేటీఆర్‌తో చర్చించి తమ పార్టీ వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి పొటెన్షియల్ నగరాల అభివృద్ధి కొత్తగా తెస్తున్న జోన్ల ఎంపికతో వెనక్కి నెట్టివేయబడే అవకాశం ఉన్నదని.. ఇదొక ఫాల్తూ నిర్ణయమని తెలిపారు. హైదరాబాద్ తప్ప మిగిలిన గ్రామీణ తెలంగాణను నిర్లక్ష్యం చేసే కుట్ర కనిపిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే అని.. విజన్ డాక్యుమెంట్ రూపొందించేటప్పుడు లోపాలన్నింటినీ సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చిరుమళ్ల రాకేశ్‌కుమార్, పల్లె రవికుమార్, గోసుల శ్రీనివాస్ యాదవ్, కార్తీక్ రాయల పాల్గొన్నారు.

Next Story