- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లపై గ్రీన్ సిగ్నల్ వచ్చేనా? సర్కారు రెడీ చేసిన ప్లాన్ బీ ఏంటి?
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్‌పై వచ్చేనెల 8న హైకోర్టు విచారించనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్‌పై వచ్చేనెల 8న హైకోర్టు విచారించనున్నది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోతున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక అభ్యంతరం చెపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసి, కొత్తగా కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది.
కోర్టు ఒప్పుకోవడం కష్టమే!
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈనెల 27న దాఖలైన హౌజ్ మోషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా ‘రిజర్వేషన్ల పెంపు ఏ ప్రతిపాదికన ఇస్తారు? బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా ఇస్తారు?’ అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేసింది. కాని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబరు 9 నుంచి ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూలు ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయ వర్గాల్లో జరుగుతున్నది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తుచేస్తున్నారు. విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే చాన్స్ ఉందని వాదిస్తున్నారు.
ప్లాన్ బీతో సర్కారు రెడీ
పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బీని అమలు చేసేందుకు సర్కారు రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది. అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్లీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అందుకోసం కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా? లేక ఇతర వర్గాలకు తగ్గించి, బీసీలకు ఏమైనా పెంచుతుందా?అనే చర్చ జరుగుతున్నది.






