Phone tapping case: ఏం జరిగిందో చెప్పాలి.. కేసీఆర్‍పై కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 08:25:07  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Phone tapping case: ఏం జరిగిందో చెప్పాలి.. కేసీఆర్‍పై కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సిట్ విచారణను ఎదుర్కొన్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) విషయంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడిన కవిత.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందుకే ఆయనను విచారణకు పిలిచారని చెప్పారు. విచారణకు ఎవరినీ పిలిచినా సరే వెళ్లాల్సిందే చట్టాలకు ఎవరు అతీతం కాదని నేను తప్పు చేయకపోయినా సరే ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లానన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే కూడా వెళ్తానని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్‍ను విచారణకు పిలవటమే నేరమని ఆయన అంటున్నారు.అభ్యర్థి చెడ్డోడైనా కేసీఆర్‍ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారు ఇలాంటి రాచరిక, నియంతృత్వ పోకడలను మార్చుకోకుంటే బీఆర్ఎస్‍ను ఎవరు కాపాడలేరని అన్నారు.

ఆ నమ్మకం నాకు లేదు:

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) సాగదీయకుండా విచారణను తుది దశకు తేవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‍ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారని నమ్మకం నాకు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నారు. నిజంగా కాంగ్రెస్‍కు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా ఎందుకు కేసు ముందుకు పడటం లేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు సైకిల్‍కు స్టాండ్ వేసి తొక్కినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆ కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదు:

కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేనని కవిత విమర్శించారు. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని వీటిపై నేను చేసిన రీసెర్చ్ లో చాలా కంపెనీల గుట్టు బయటపడిందన్నారు. హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూల పేరుతో తెలంగాణ యువత ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‍లో అగ్నిప్రమాదాలు, నేరాలు పెరిగితే సీఎం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసిన సరే 30 వేల కోట్లు తేలేదని నిలదీశారు.

ఏఐఎఫ్‍బీ తరఫున జాగృతి పోటీ:

మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేయాలని కవిత పిలుపునిచ్చారు. జాగృతి తరఫున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని ఫిబ్రవరి 20 తర్వాత జనంబాట కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాజరిక పోకడలు అనుసరిస్తుంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదన్నారు. ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా బీజేపీ తెలంగాణకు రూపాయి ఇవ్వడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పొలిటకల్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలు, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Read More..

Sajjanar Vs BRS: సజ్జనార్ ట్వీట్‍కు హరీశ్ రావు కౌంటర్.. అసలేం జరిగిందంటే?

Next Story