SRH vs CSK మ్యాచ్ లో జరిగిందిదే.. రివీల్ చేసిన 'నిమ్మకాయ మాంత్రికుడు'

by Prasad Jukanti |

ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయతో క్షుద్రపూజల వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఓ వైపు స్టేడియంలో భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకంగా మార్చిందని అలాగే క్రీడా అభిమానుల మనసులను గాయపరిచిందనే చర్చ జరుగుతోంది.

SRH vs CSK మ్యాచ్ లో జరిగిందిదే.. రివీల్ చేసిన నిమ్మకాయ మాంత్రికుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ లో క్షుద్రపూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎస్ఆర్‍హెచ్ అభిమాని ఒకరు నిమ్మకాయతో బ్లాక్ మ్యాజిక్ చేయగా వెంటనే శివమ్ దూమే వికెట్ పడిపోయినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం సైతం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు ఓ లేఖ సర్క్యూలేట్ అయినా అది ఫేక్ లెటర్ అని తర్వాత తేలింది. అయితే నిమ్మకాయతో మంత్రాలు చేసిన వీడియో వ్యవహారం సీఎస్కే ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఆ మ్యాచ్‍లో ఏం జరిగిందో నిమ్మకాయతో మంత్రం వేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి వివరణ ఇచ్చాడు.

ఆ కారణంతో స్టేడియం లోపలికి నిమ్మకాయ:

వీడియోలో నిమ్మకాయకు మంత్రాలు వేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి పేరు సన్ని. తాజాగా ఓ తెలుగు న్యూస్ చానల్ తో మాట్లాడిన సన్నీ.. తాను ఓ కంటెంట్ క్రియేటర్‍నని అలాగే ఎస్ఆర్‍హెచ్ అభిమానినని చెప్పుకున్నాడు. ఒక్క నిమ్మకాయ తనను వైరల్ గా మార్చేసిందన్నారు. స్టేడియం లోపలికి వాలెట్, ఇయర్ బర్డ్స్ నే అనుమతి ఇవ్వని పోలీసులు నిమ్మకాయ‍ను ఎలా తీసుకు వెళ్లనిచ్చారనేది సస్పెన్స్ గా మారింది. ఈ విషయంలో స్పందించిన సన్నీ.. క్యాబ్‍లో వెళ్తే తనకు వాంతులు అవుతాయని అలా కాకూడదని తన వెంట నిమ్మకాయ తీసుకువెళ్లానని చెప్పారు. నిమ్మకాయతో వెళ్తున్న తనను తొలుత పోలీసులు అడ్డుకున్నారని అయితే తన పరిస్థితి వివరించి వారిని బతిమిలాడుకుని నిమ్మకాయను స్టేడియం లోపలికి తీసుకువెళ్లానన్నాడు. స్టేడియం లోపలికి వెళ్లాక అక్కడికక్కడ వచ్చిన ఆలోచనతోనే ఆ రీల్ చేశానని దాని వెనుక ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ లేదని, తనకు ఎలాంటి క్షుద్రపూజలు రావని స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో కంటే ముందు నాలుగు సార్లు కూడా వీడియో ట్రై చేశామని చివరి ప్రయత్నంలో వికెట్ పడిపోయిందన్నారు. దాన్ని వెంటనే పక్కనే ఉన్న మరో ఎస్ఆర్‍హెచ్ సపోర్టర్‍కు చూయిస్తే తాను చాలా సర్ ప్రైజ్ అయ్యారని దాంతో తాను ఇంటికి వచ్చాక ఆ వీడియోను సోషల్ మీడియాలో రాత్రి అప్‍లోడ్ చేస్తే తెల్లారేసరికి వైరల్ అయిందన్నారు.

క్షమించండి:

తాను చేసిన ఈ వీడియో ప్రీ ప్లాన్డ్ గా చేసింది కాదని నా హెల్త్ కోసం తీసుకువెళ్లిన నిమ్మకాయతో అనుకోకుండా చేసిందేనని సన్నీ చెప్పాడు. ఈ విషయంలో ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. పోలీసులు నన్ను సంప్రదించినా ఇదే విషయం చెబుతానన్నారు. బ్లాక్ మ్యాజిక్ వల్లే వికెట్లు పడితే రేపటి నుంచి అందరూ జెండాలకు బదులు నిమ్మకాయలే తీసుకువెళ్తారు కదా? ఇది కేవలం జనాలను నవ్వించడానికి చేసిన పనేనని అంతకు మించి ఏమి లేదన్నారు. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ వీడియో సన్ని జీవితాన్ని మలుపు తిప్పుతుందో చూడాలి మరి.

Next Story