క్యాతన్‍పల్లి మున్సిపాలిటీ: పంతానికి పోయి ఏం సాధించారు? మంత్రి వివేక్ పై విమర్శలు

by Prasad Jukanti |

క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

క్యాతన్‍పల్లి మున్సిపాలిటీ: పంతానికి పోయి ఏం సాధించారు? మంత్రి వివేక్ పై విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా క్యాతన్‍పల్లి మున్సిపాలిటీపై ఉత్కంఠ వీడింది. ఆయా కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మున్సిపల్ పీఠం చివరకు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇవాళ ఉదయం చైర్మన్, వైస్ చైర్మన్ పదవికి అధికారులు ఎన్నిక నిర్వహించగా చైర్మన్‍గా సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ చైర్మన్ గా సరిత(సీపీఐ) గెలుపొందారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే తాను ప్రాతనిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పంతానికి పోయిన మంత్రి గడ్డం వివేక్ చివరకు ప‌రాభ‌వం చ‌వి చూశారనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

ప్రయత్నాలు ఫలించక:

ఇక్కడ ఎన్నికలకు ముందే కూటమిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ ఒక్క స్థానం దక్కించుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్, ఆయన కుమారుడు, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫిషీయో ఓట్లతో కాంగ్రెస్ బలం 10కు చేరింది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిలోని ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు సంపాదిస్తే చైర్మన్ పదవి సొంతం చేసుకోవచ్చనే వ్యూహంలో మంత్రి వివేక్ వ్యూహరచన చేసినట్లు ప్రచారం జరింది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్ల సంఖ్యా బలం లేకపోయినా మంత్రి వివేక్ పట్టుదలకు పోయారని, ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను సైతం అరెస్టు చేయించారనే విమర్శలు మంత్రిపై వినిపించాయి. ఇంత జరిగినా చివరకు సొంత ఇలాకాలో మున్సిపల్ పీఠం దక్కించుకోలేక మంత్రి వివేక్ చేతులెత్తేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంత్రి తీరుతో పార్టీకి డ్యామేజ్:

మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల హైడ్రామాలు కొనసాగినా క్యాతన్‍పల్లి రాజకీయం మరోలా సాగింది. ఇక్కడ అవకాశం లేకపోయినా మంత్రి వివేక్ వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్‍లో చర్చనీయాశంగా మారాయి. ఇక్కడ మంత్రి వివేక్ ఎన్నో అరాచకాలు సృష్టించారని, ప్రలోభాలకు గురి చేశారని, బాల్క సుమన్ ను అరెస్టు చేయించడం వెనుక మంత్రి వివేక్ ఒత్తిడి ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇంత జరిగినా మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం కాకపోవడంతో మంత్రి తీరుతో పార్టీకి డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మంత్రి వివేక్ పని తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ క్యాతన్‍పల్లి మున్సిపల్ పరిణామాలు రాబోయే కేబినెట్ విస్తరణపై ఏమేరకు ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story