- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెనిఫిట్స్ ఇప్పిస్తాం.. కేసు వేయండి: రిటైర్డ్ ఉద్యోగులకు అడ్వకేట్ల ఆఫర్లు
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో కోర్టు కేసులు పెరుగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ పలువురు న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులకు ఆఫర్లు ఇస్తున్నారు. అడ్రస్‌లు కనుక్కుని ఇంటికి వెళ్లి కేసులు వేయాలంటూ నచ్చచెప్తున్నారు. కేసు వేసిన రెండునెలలలోపు బెనిఫిట్స్ చేతికి అందుతాయని ఆశ చూపుతున్నారు. దీంతో కోర్టులో కేసులు వేసేందుకు పెన్షనర్లు ముందుకు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ మధ్య కోర్టులో కేసులు వేసిన 2,460 మందికి బెనిఫిట్స్ రిలీజ్ చేయడంతో మిగతా విశ్రాంతి ఉద్యోగులు సైతం ఆవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇప్పుడు కేసుకు రూ.25 వేలే..
నిధుల కొరత కారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతున్నది. దీంతో టోకన్లు జారీ చేసిన ఏడాది తరువాత కూడా నిధులు జమ కావడం లేదు. ఈ క్రమంలో విసిగిపోయిన కొందరు పెన్షనర్లు తమకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వట్లేదని కేసులు వేసేందుకు న్యాయవాదుల వద్దకు వెళ్తే ఒక్కో కేసుకు రూ. 2 లక్షలకు పైగా ఫీజు తీసుకుని దాఖలు చేసినట్లు తెలిసింది. కొందరు న్యాయవాదులైతే సర్కారు నుంచి అందాల్సిన బెనిఫిట్ మొత్తంలో 3 శాతం ఫీజు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. న్యాయవాదులు అడిగినంత సొమ్మును చెల్లించి పెన్షనర్లు కేసులు వేశారు. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఒకేసారి 2,460 మందికి బెనిఫిట్స్ అందాయి. దీంతో కొత్తగా వేసే కేసుల విచారణకు పెద్ద సమయం కూడా అవసరం ఉండదని పాత కేసు తీర్పు ఆధారంగా రెండు మూడు నెలల్లోనే తుది తీర్పు వస్తుందని న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులను ఒప్పిస్తున్నట్లు తెలిసింది. అయితే ఫీజు కూడా పాతిక వేలు ఇస్తే చాలని, ఐదారుగురు కలిసి వస్తే మరింత ఫీజు తగ్గుతుందని చెప్పడంతో బాధితులు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇటీవలే రూ.751 కోట్లు రిలీజ్..
పదవీ విరమణ చేసిన ఏడాది దాటినా తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో 2,640 మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టన కోర్టు పిటిషనర్లకు నిధులు మంజూరు చేయాలని ఏడాది క్రితం ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పాటించకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ కేసు వేశారు. కేసును గత నెల 24న విచారించిన న్యాయస్థానం ఫైనాన్స్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియాను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో విచారణకు అటెండ్ అయిన సుల్తానియా వివరణను విన్న కోర్టు ఎప్పటిలోగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తారని ప్రశ్నించగా నాలుగు వారాల్లో (ఏప్రిల్ 9లోపు) చెల్లిస్తామని తెలిపారు. కోర్టుకు ఇచ్చిన హామీమేరకు రెండురోజుల క్రితమే సుమారు రూ. 750కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక్కో రోజు కోర్టులో పాతిక వరకు కేసులు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ప్రతినెల 500 మంది రిటైర్‌మెంట్..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేల మంది విశ్రాంత ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికితోడు ప్రతి నెల దాదాపు 500 మంది రిటైర్ అవుతున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి సగటును రూ. కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వం ప్రతినెల కేవలం రూ.700 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నది. దీంతో లబ్ధిదారుల సంఖ్య ప్రతినెలా పెరుగుతోంది. ఒకనెలలో రెండు మూడు వేల కోట్లు రిలీజ్ చేస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గిపోతుందని రిటైర్డ్ ఉద్యోగుల్లో సైతం ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుందని చర్చ ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది.






