- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం వెన్నులో వణుకు పుట్టిస్తాం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా, బీసీ మహిళలకు చట్టసభల్లో ఉప కోటా దక్కే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించబోదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. పూలే జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పటికీ, అందులో బీసీ మహిళలకు ఉపకోటా లేకపోవడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఉపకోటా లేకపోవడమంటే పాలకులకు భయం లేనట్లేనని, కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా జాగృతి ఉద్యమిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పూలే మళ్లీ పుట్టారా అన్నట్లుగా ఈ పోరాటం ఉంటుందని కవిత అన్నారు.
ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో తాను ఢిల్లీ (Delhi)కి వెళ్లి అన్ని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడతానని కవిత వెల్లడించారు. ఎంపీల బలం ఉందని బిల్లును అలాగే పాస్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కోరితే ట్యాంక్ బండ్ వద్ద పెడతామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికైనా విగ్రహాన్ని పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆర్టిజన్లకు పూర్తి మద్దతు..
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ (Regularization) కోసం జాగృతి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కవిత తెలిపారు. ఆర్టిజన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, దీనికి నిరసనగా కొత్తగూడెంలో జరుగుతున్న ఆందోళనలో జాగృతి నాయకులు పాల్గొంటారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆటిజన్ల జీతాలు రూ.40 వేలకు పెంచడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందని ఆమె గుర్తు చేశారు. సమాజంలో మార్పు రావాలంటే అది మన నుంచే మొదలు కావాలని అన్నారు. పూలే ఎన్ని అవమానాలు ఎదురైనా వెన్ను చూపకుండా పోరాడారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కవిత పిలుపునిచ్చారు.






