తెలంగాణ మీడియా అకాడమీలో ‘నెరవేరిన కల’ సినిమా ప్రదర్శన

by Kodari Anjali |

తెలంగాణ సామాజిక, రాజకీయ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ‘నెరవేరిన కల’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఆదివారం అబిడ్స్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం నిర్వహించారు.

తెలంగాణ మీడియా అకాడమీలో ‘నెరవేరిన కల’ సినిమా ప్రదర్శన
X

దిశ, కార్వాన్: తెలంగాణ సామాజిక, రాజకీయ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ‘నెరవేరిన కల’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఆదివారం అబిడ్స్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సయ్యద్ రఫీ మాట్లాడుతూ.. గతంలో తాను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘ఇంకెన్నాళ్లు’ సినిమాను నిర్మించి ఉద్యమానికి ఊపు అందించానని గుర్తుచేశారు. ఎన్నో తరాల త్యాగాలు, బలిదానాల తర్వాత సిద్ధించిన తెలంగాణలో.. ప్రజలు ఆశించిన ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదనే అభిప్రాయాన్ని ఈ చిత్రం ద్వారా పంచుకున్నట్లు తెలిపారు. ప్రజా తెలంగాణ స్వయంపాలనలో ఉద్యమ ఆకాంక్షలను ఎలా నెరవేర్చుకోవచ్చో, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఈ సినిమాలో చూపించామన్నారు. గతంలో ‘నా ఆయుధం సినిమా.. దాని లక్ష్యం తెలంగాణ’ అనే నినాదంతో ‘ఇంకెన్నాళ్లు’ తీశానని, ఇప్పుడు స్వరాష్ట్రంలో ‘నా ఆయుధం సినిమా.. దాని లక్ష్యం ప్రజా చైతన్యం’ అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు రఫీ పేర్కొన్నారు. సమాజంలో మార్పు వచ్చే వరకు ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటామని, ప్రతి పౌరుడికీ ఈ చిత్రాన్ని చేరవేసే ప్రయత్నంలో ఇవి తొలి అడుగులని ఆయన వివరించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో దర్శక నిర్మాత సయ్యద్ రఫీతో పాటు పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story