బరాబర్ ఆ రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తాం.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 09:03:20  IST  )

కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

బరాబర్ ఆ రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తాం.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో ఆయన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నేటి పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడూ కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు.

హీరోలు మౌనంగా ఉంటే.. విలన్లు రెచ్చిపోతారు

అటు కేంద్రంలో... ఇటు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ గారి ప్రాణం ముఖ్యమని, దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలమని ఫోజులు కొడతారని ధ్వజమెత్తారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

పోరాట వీరులు ఓ వైపు.. బానిసలు ఓ వైపు

తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాదని... సీఎం రేవంత్ రెడ్డిలా ఏనాడూ తెలంగాణ బలిదేవత సోనియాగాంధీ అని తాము అనలేదన్నారు. మమ్మల్ని అవమానిస్తే ఊరుకుంటాం కానీ, తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిసారీ తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1950 నుంచి 2025 వరకు తెలంగాణ తొలి శత్రువు, విలన్ ఆ పార్టీనేనని అన్నారు. దమ్ముంటే తమ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాల కోసం, ప్రజల కోసం నిలబడిన వీరులు ఒకవైపు... 60 ఏళ్ల పాటు బానిసలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోవైపని అన్నారు. తల్లి తెలంగాణను తీసివేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలేనని అన్నారు. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహాన్ని బదులుగా పెడతామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల పోరాట పటిమను గుర్తుచేసుకుని మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

Next Story