- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు : పొంగులేటి
రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

దిశ, తిరుమలాయపాలెం: రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మూడు నెలలు గడిచిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలల్లో రోడ్లు, డ్రైయిన్లు ఇతర ఇతర మౌళిక వసతుల కల్పన పనులు ప్రాధాన్యతతో చేపట్టామని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం చేపట్టిందన్నారు.
దమ్మాయిగూడెం గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్య రేపటి వరకు పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన రేషన్ కార్డులు జారీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి అనేక హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు మంజూరు చేస్తామని, రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని మంత్రి చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడెం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యతగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు వినియోగిస్తూ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా రోడ్లను క్లిన్ చేయడమే కాకుండా, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను కూడా శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, పాలేరు ఆత్మకమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రామసహయం, నరేశ్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మంగీలాల్, అశోక్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలారు సాహెబ్, సర్పంచ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






