- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ముంబయి క్లైమెట్ వీక్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. గ్రీన్ ఎనర్జీ ప్రయార్టీని వివరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి (Green Energy) ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రీన్ ఎనర్జీకి తాము ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ 30 లక్షలకు పైగా పంప్‌సెట్‌లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ శక్తిని బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ (Climate Week Maharashtra) సదస్సులో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు.
దేశంలోనే తొలి నగరంగా హైదరాబాద్:
హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్‍జీరో నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. పట్టణభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలేనని సీఎం గుర్తు చేశారు. 1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని వివరించారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్ వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయని అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs) మన దేశంలో ఉన్నాయన్నారు. అయితే, ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయినట్లు అభిప్రాయపడ్డారు.
చైనా +1 ప్రయత్నామ్నాయం మా లక్ష్యం:
కోవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని, ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. తెలంగాణ జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించినట్లు వివరించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.
తెలంగాణలోనే EV తయారీ కోసం చర్చలు:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 25శాం గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని సీఎం తెలిపారు. ORR, RRR మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని, తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో వనరుల పెరుగుదలలో ప్రధాన భాగం గ్రీన్‌గా ఉండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టి, ఉత్పత్తి , వినియోగం పెంపు కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ మూడు జోన్‌లలో గ్రీన్ స్ట్రాటజీని అవలంబించిందని తెలిపారు. తెలంగాణలోనే EV తయారీ కోసం సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రెట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ. పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
హైడ్రా రూపంలో ప్రత్యేక దళం:
పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్‌లకు తరలిస్తున్నామని సీఎం చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా (HYDRAA) రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.






