రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు.. సీఎం మార్పు అంటూ ప్రచారం వేళ పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

గాంధీ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వచ్చే శాసనసభ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు.. సీఎం మార్పు అంటూ ప్రచారం వేళ పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: అభివృద్ది, సంక్షేమం ధ్యేయంగా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందని, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండావిష్కరణ చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో మంది త్యాగధనుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. సోనియా గాంధీ ధృఢ సంకల్పంతో తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందన్నారు. పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు.

సీఎం రేవంత్ నేతృత్వంలోనే ఎన్నికలకు:

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. మత సామరస్యం పూర్వకంగా రాష్ట్రం నడుస్తోందని లౌకిక వాదం అయిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందన్నారు. మిగిలిన రెండున్నర ఏళ్ళు తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అన్న వారి కుటుంబమే బంగారం అయ్యిందని విమర్శించారు.

ఆసక్తిగా పీసీసీ కామెంట్స్:

అయితే సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారంలోకి వస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి మార్పు జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయంలో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారా లేదా క్యాజువల్ గానే ఈ కామెంట్స్ చేశారా అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story