ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ.. రూ.300 కోట్లతో పామాయిల్​ఫ్యాక్టరీ

by Bhoopathi Nagaiah |

దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది.

ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ.. రూ.300 కోట్లతో పామాయిల్​ఫ్యాక్టరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పరిమితులు విధిస్తుండటంతో రైతులు వరి మాత్రమే కాకుండా పామాయిల్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. రైతులకు అధిక ఆదాయం పొందే ప్రత్యామ్నాయ పంటగా పామాయిల్ పంట ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపు, ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి దీర్ఘకాలిక భరోసా ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందని, ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాలపాటు నిరంతర ఆదాయం అందించే ఈ పంట తెలంగాణ రైతులకు బంగారు భవిష్యత్తును అందించగలదని పేర్కొన్నారు.

శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించి ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త దశను తీసుకువస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. గంటకు 30 నుండి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆయిల్ పామ్ పనులు ప్రారంభించి, కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ పామ్ రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్​ఫామ్​సాగు :

రాష్ట్రంలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుండగా 14 కంపెనీలు ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి పనిచేస్తున్నాయని, ఆయిల్ ఫెడ్ పరిధిలోనే దాదాపు 42758 మంది రైతులు 1.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోనే 14361 ఎకరాల్లో 4,469 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, జనగామ, యాదాద్రి భువనగిరి, గద్వాల్, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల్లో కలిపి 49376 ఎకరాల్లో 13479 మంది రైతులు సాగు చేస్తున్నారని వివరించారు. దేశంలో వంట నూనెలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం సుమారు 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి అవుతున్నాయని తెలిపారు. అందులో దాదాపు 59 శాతం పామాయిల్ వాటానే అని పేర్కొన్నారు. గత ఏడాది మాత్రమే దేశం లక్షా 38 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, ఇందులో పెద్ద భాగం పామాయిల్‌దేనని చెప్పారు.

ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందు రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా రైతుల సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పామాయిల్ సాగు ద్వారా రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి రానున్న రోజుల్లో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్యం సాధ్యమైతే తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ముందంజలో నిలవడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story