- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GHMC ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓ విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే వివాదం మొదలైందని, ఆయనపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తెలంగాణలో జనసేన ‘నవ నిర్మాణ సభ’కు హైకోర్టు అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తనకు అధికారంపై ప్రేమ లేదని, కేవలం మార్పుపైనే ప్రేమ ఉందని అన్నారు. ఓ విశ్లేషకుడిపై కేసులు పెడితే.. ఆయనపై ఉన్న గౌరవంతో ఆ కేసులను ఉపసంహరించుకోవాలని తానే చెప్పానని అన్నారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ నన్ను తిట్టారని వ్యాఖ్యానించారు. ఇలాంటి విశ్లేషకుల వల్లే కమ్యూనిజం అంతరించిపోయిందని విమర్శించారు. తెలంగాణలో వచ్చే ప్రతి సమస్యకూ ఆంధ్రవారే కారణమా? అని ఆయన ప్రశ్నించారు. తనకు సమాజంలో గొడవలు రేపడం ఇష్టం లేదని, అందుకే ఎన్నోసార్లు తగ్గి ఊరుకున్నానని పవన్ అన్నారు.
గద్దరన్నకు మీరు ఏం చేశారు..?
తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా తప్పులేదు కానీ, పాలకులు వేరు, ప్రజలు వేరని.. పాలకులను తిట్టాలి తప్ప ప్రజలను కాదని పవన్ హితవు పలికారు. ప్రజా గాయకుడు గద్దర్ బతికున్న రోజుల్లో ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘శరీరంలో బుల్లెట్లు దిగాయి, సరిగ్గా నడవలేకపోతున్నాను తమ్మి.. ఓ కారు కొనివ్వు’అని గద్దర్ అడిగితే.. మూడు రోజుల్లోనే ఆయనకు కారు కొనిచ్చానని గుర్తుచేశారు. ఇదే వైఎస్ఆర్ బతికి ఉన్ననాడు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నేతల గొంతులంతా ఏమయ్యాయని ప్రశ్నించారు. తనపై తొలి కేసు నమోదైంది కూడా తెలంగాణలోనేనని పవన్ తెలిపారు.
పాశం యాదగిరి తిట్టడం బాధేసింది..
రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీ దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరాగాంధీ (Indira Gandhi) మెదక్‌లో పోటీ చేస్తే తప్పులేదు కానీ, జనసేన తెలంగాణలో ప్రజల తరఫున పోరాటం చేస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు తప్పుగా కనిపిస్తోందని పవన్ సెటైర్లు వేశారు. పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు కూడా తనను తిట్టడం బాధ కలిగించిందన్నారు. గతంలో వారితో తాను తన ఇంట్లోనే చాలాసార్లు భేటీ అయ్యానని తెలిపారు. ‘మీరు భయపెట్టే కొద్దీ.. మా గుండె మరింత గట్టిపడుతుంది’ అంటూ విమర్శకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
2029లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది..
అయితే, తమపై జరుగుతున్న ఈ విమర్శల వెనుక రేవంత్ రెడ్డి గానీ, కేసీఆర్ గానీ ఉన్నారని తాను అనుకోవడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య పెచ్చుమీరుతున్న ప్రాంతీయవాదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక 2029 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమతో కలిసి వస్తుందో లేదో తెలియదు కానీ, తెలంగాణలో మాత్రం తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ తాను వ్యక్తిగతంగా పోటీ చేయబోనని, తన పార్టీ అభ్యర్థులు గెలిస్తే చాలని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.






