డిండికి నీటి తరలింపును అడ్డుకుంటాం

by Elthuri vijay kumar |

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ కు గండి కొట్టి 50 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, తన ప్రాణాలు ఫణంగా పెట్టైనా డిండికి నీటి తరలింపును అడ్డుకుంటానని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.

డిండికి నీటి తరలింపును అడ్డుకుంటాం
X

డిండికి నీటి తరలింపును అడ్డుకుంటాం

- రైతుల కోసం చావడానికైనా సిద్ధం

- రాజకీయంతో వ్యాపారం చేయొద్దు

- మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి

దిశ నాగర్ కర్నూల్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ కు గండి కొట్టి 50 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, తన ప్రాణాలు ఫణంగా పెట్టైనా డిండికి నీటి తరలింపును అడ్డుకుంటానని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 36 లక్షల ఎకరాలకు సాగుభూమి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడు మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయని, మిగతా రెండు పనిచేయక సంవత్సరం కాలం పూర్తయినా నేటి వరకు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రైతులను ఎందుకు మోసం చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో డిండి ప్రాజెక్టుకు గండి కొట్టేది లేదనీ హెచ్చరించారు. రైతుల కోసం చావడానికైనా సిద్ధమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీ రాజకీయ స్వార్థం మాని రైతులకు న్యాయం చేయండి అని మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చింది రైతులు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఓ మంత్రి మాట్లాడుతూ... మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో నాకు తెలియదు.. అని అంటుండు ఆ మంత్రిపై అతనికే నమ్మకం లేదా అని మంత్రి జూపల్లిని ఉద్దేశించి చురకలంటించారు. రాజకీయాలకతీతంగా నీటిని తరలించకుండా అడ్డుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొందరు నాయకులు రాజకీయంతో వ్యాపారం చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు అర్థం రవి, తిమ్మాజిపేట పాండు, ఐతోల్ లక్ష్మయ్య, బాల గౌడ్, భీముడు, తదితరులు పాల్గొన్నారు.

Next Story