వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య రాకుండా చూడాలి : మంత్రి సీతక్క

by Naga Rani Yarlagadda |

వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య రాకుండా చూడాలి : మంత్రి సీతక్క
X
  • విద్యుత్ సరఫరా, పైపులైన్లకు ఇబ్బంది లేకుండా చూడాలి
  • మిషన్ భగీరథ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరాపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించాలని, సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పంపు సెట్లు పాడైన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చిన్న లోపాల వల్ల పెద్ద సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గత ఏడాది పకడ్బందీ ప్రణాళికలతో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా నియంత్రించగలిగామని మంత్రి గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉందని, అయితే ఎప్పటికప్పుడు నీటి నిల్వలను అంచనా వేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే సమయంలో, కొన్ని చోట్ల మిషన్ భగీరథ సిబ్బంది స్వలాభం కోసం అవసరం లేకపోయినా కొత్త బోర్లు వేయాలని ప్రోత్సహిస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరం లేని కొత్త బోర్ల వల్ల డబ్బు, శ్రమ రెండూ వృథా అవుతున్నాయని, దీనిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మేడారం జాతర నేపథ్యంలో తాగునీటికి ప్రత్యేక చర్యలు

మేడారం మహా జాతర దృష్ట్యా తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జాతర సందర్భంగా ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన మేడారంలో మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతర కాలంలో నిరంతరం అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా అయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండటం ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మేడారం మహా జాతరకు ఆహ్వానిస్తూ మిషన్ భగీరథ సిబ్బంది తరుపున ఈఎన్సీ కృపాకర్ రెడ్డికి మంత్రి సీతక్క ఆహ్వానపత్రిక ఇచ్చారు.

Next Story