- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు అయన పోలీసు బలగాలు కవాతు నిర్వహించగా సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నేడు మనమంతా అనుభవిస్తోన్న స్వాతంత్ర్య ఫలాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని తెలిపారు. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశామని అన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించామని సీఎం వెల్లడించారు.
పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యవసరాలు అందించే ఉద్దేశంతో రేషన్ షాపుల ద్వారా ‘సన్న బియ్యం’ పంపిణీని ప్రారంభించామని అన్నారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అయిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అన్నం పెట్టే రైతు అప్పు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదన్న ఆలోచనతో ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశామన్నారు. జూన్ 16న పథకాన్ని ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 70,11,184 మంది రైతుల ఖాతాల్లో రూ.తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. పదేళ్ల తర్వాత పేదల సొంతింటి కలలకు మళ్లీ రెక్కలు తొడిగామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నేడు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అందుకు గాను రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






