Bhatti Vikramarka: మళ్లీ అసైన్ మెంట్ కమిటీలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-06-03 07:46:58  IST  )

మళ్లీ అసైన్ మెంట్ కమిటీలు ప్రవేశపెట్టబోతున్నామని భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.

Bhatti Vikramarka: మళ్లీ అసైన్ మెంట్ కమిటీలు..  భట్టి విక్రమార్క కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో/ఎర్రుపాలెం: అత్యంత పారదర్శకమైన భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే చట్టాన్ని జాగ్రత్తగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశామని ఈ కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం.. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంతో ఉందో తెలిసేది, ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదన్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందన్నారు. భూభారతి లాంటి చట్టం మన దేశంలో చాలా అరుదుగా వస్తాయన్నారు. ధరణి వల్ల రైతులు ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి అలసిపోయారే తప్ప పరిష్కారం దక్కలేదన్నారు. అధికారుల నుంచి జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దలేకపోయారని విమర్శించారు. ఈ పరిస్థితిపై ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాట ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ధరణిని తొలగించి దాని స్థానంలో భూభారతి-2025 కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రజా ప్రభుత్వం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు ప్రస్తావనకు వస్తుందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ మిగులు భూములు ఉంటే వాటిని ప్రజా వినియోగం కోసం ఉపయోగించుకునేలా అసైన్ మెంట్ కమిటీలను తిరిగి ప్రవేశపెట్టబోతున్నామన్నారు.

Next Story