- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జలసౌధలో నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత-చేవెళ్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘం సమావేశానికి హాజరై ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుండి అనుమతి తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చించి అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే.. సీతారాంసాగర్, మోడికుంటవాగు, చనాకా/కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టంతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాలకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కృష్ణా జలాల వివిధ ట్రిబ్యునల్ విషయమై సుప్రీంకోర్టులో ఈ నెల 23, 25న వాదనలు ఉన్నందున అంతకుముందే సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్ వైద్యనాథ్‌తో చర్చలు జరగనున్నట్లు చెప్పారు.
NDSA సూచనలతో మేడిగడ్డ పునరుద్ధరణ
జాతీయ డ్యామ్‌ల పరిరక్షణ సంస్థ (ఎన్‌డీఎస్ఏ) చేసిన సూచనలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. బ్యారేజ్‌లను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని తెలిపారు. అదే సమయంలో ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలతో నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరీక్షించేలా చర్యలు తీసుకోవడంతోపాటు వరదలు తగ్గిన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వచ్చే సంవత్సరం వానాకాలంలోపు పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాసంతోపాటు అటవీశాఖ అనుమతుల వంటి ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా డిండి, ఎస్ఎల్‌బీసీ, పెండ్లి పాకల, నక్కలగండి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ముందే దేవాదుల ప్యాకేజ్3,6 పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు నిర్వహించతలబెట్టిన హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
పూడికతీతపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
యావత్ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా చేపట్టిన రిజర్వాయర్లలో పూడిక తీత పనులపై పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఇప్పటికే మిడ్‌మానేరు, కడెం రిజర్వాయర్లలో పనులు మొదలుపెట్టామని.. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్ తదితర ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు చేపట్టిన పూడికతీత పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్ల రాబడి ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్లయిటే ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల నుండి రూ.4,000 కోట్ల వరకు రాబడి వస్తుందన్నారు. నీటిపారుదల శాఖలో మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత పదోన్నతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పదోన్నతులు పొందిన వారికి ఈ నెల 14న జలసౌధలో అభినంద సభ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, సీఈలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






