- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: తాగునీటి జలాశయంలోకి మురుగునీరు.. జలమండలి వివరణ
తాగునీటి జలాశయంలో అక్రమంగా మురుగునీటిని (Septic Waste) పారబోసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయంలో అక్రమంగా మురుగునీటిని (Septic Waste) పారబోసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ HMWSSB జలమండలి స్పందించింది. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్‌ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జలమండలి తెలిపిన వివరాల ప్రకారం..
డిసెంబర్ 17 ఉదయం 8:00 గంటల సమయంలో, హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్.టీ.ఎల్ (FTL) పాయింట్ నెంబర్ 428 వద్ద TG11 T1833 నంబర్ గల సెప్టిక్ ట్యాంకర్ అక్రమంగా మురుగునీటిని జలాశయంలోకి వదలడానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. విచారణలో, డ్రైవర్ రామావత్ శివ నాయక్ (33), హిమాయత్ నగర్ నివాసి నిరంజన్ ఆదేశాల మేరకు ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారు. ఈ ఘటనలో జలమండలి అధికారులు ప్రధానంగా మూడు అంశాలను గుర్తించారు. సదరు ట్యాంకర్‌పై ఎటువంటి అనుమతి లేకుండా HMWSSB లోగోను వినియోగించారు. ప్రజలను, అధికారులను నమ్మించి, తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మోసపూరితంగా లోగోను వాడినట్లు తేలింది. ఈ వాహనం బోర్డులో నమోదు చేయబడలేదు. అలాగే నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని బోర్డు కోరింది. రక్షిత జలాశయంలో మురుగునీరు కలపడం వల్ల లక్షలాది మందికి సరఫరా అయ్యే తాగునీరు కలుషితమై ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
ప్రజలకు జలమండలి ఎండీ విజ్ఞప్తి..
ఉస్మాన్ సాగర్ జలాశయంలో మురుగునీటిని పారబోసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతోందని మా దృష్టికి వచ్చింది. ఆ నిజానికి ఒక ట్యాంకర్ క్లీనింగ్ చేసి తీసుకెళ్ళిన ట్యాంకర్ ను మా డిజిఎం పట్టుకొని ఆ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో లారీ డ్రైవర్, ఓవర్ ఇద్దరిపై క్రిమినల్ కేస్ నమోదు చేసామని అన్నారు. అలాగే జంట రిజర్వాయర్లలో చుట్టుపక్కల నుంచి సీవరేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుందని జలాశయానికి రెండు వైపులా ఎస్టీపీలు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. మరో ఆరు నెలల్లో ఆ ఎస్టీపీలు పూర్తయితే ఆ ప్రాంతంలోని నుంచి వచ్చే సీవరేజ్ ని కూడా 100% ట్రీట్మెంట్ చేయడానికి వెసులుబాటు దొరుకుతుందని ఎండీ వివరించారు.
అలాగే ఉస్మాన్ సాగర్ ఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, కాబట్టి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం లేదని అన్నారు. జలమండలి గండిపేట నీటిని ఆసిఫ్‌నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లకు తరలించి ప్రతి గంటకూ నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. అక్కడ నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్ధతిని అవలంబిస్తుందని ఆయన తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్య్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని.. అలాంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచుతామని ఈ సందర్భంగా అశోక్ రెడ్డి అన్నారు. జలాశయాల పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే, వెంటనే స్థానిక అధికారులకు లేదా జలమండలి 155313 కస్టమర్ కేర్ నంబర్‌కు సమాచారం అందించాలని బోర్డు కోరుతోంది.






