జలమండలి భూములు.. 36 ఏండ్లుగా పట్టించుకోని వైనం

by Yella Dhawani Reddy |

హైదరాబాద్ మహానగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపలి గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్న జలమండలికి సంబంధించిన భూములు, ఆస్తులకు లెక్కపత్రం లేకుండా పోయింది.

జలమండలి భూములు.. 36 ఏండ్లుగా పట్టించుకోని వైనం
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపలి గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్న జలమండలికి సంబంధించిన భూములు, ఆస్తులకు లెక్కపత్రం లేకుండా పోయింది. బోర్డు ఏర్పడినప్పడి నుంచి 36 ఏండ్లుగా ఎంతో మంది మేనేజింగ్ డైరెక్టర్లు మారినా వీటి గురించి పట్టించుకున్న పాపానపోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులు కట్టుడూ.. ప్రజలకు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వంటి పనులకు పరిమితమయ్యారు. కానీ ప్రస్తుత ఎండీ అశోక్ రెడ్డి సాంకేతిక పరిజ్ఞానంతో బోర్డును గాడిలో పెట్టడమేకాదు.. భూములు, ఆస్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. తాగునీటి ప్రాజెక్టులు, ఎస్టీపీలు, రిజర్వాయర్లు, ఇలా ఆయా ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం వేల ఎకరాల భూములను జలమండలికి అప్పగించింది. కానీ ఏ జిల్లాల్లో ఎంత భూమి ఉంది? ఏ శాఖ నుంచి బదిలీ కావాల్సి ఉంది? ఇంత వరకు జలమండలికి ఖాతాలోకి ఎందుకు రాలేదు? అనే అంశాలపై స్పష్టతలేదు. వీటన్నింటిని జలమండలి ఖాతాలోకి వచ్చవిధంగా ఆశోక్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. అంతేకాదు జలమండలికి ప్రత్యేకంగా ‘ధరణి’ ఖాతా కూడా ఇచ్చారు.

14 వేల ఎకరాలు..

జలమండలికి 14 వేల ఎకరాల భూములున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 900 ఎకరాలు, పెద్దపల్లిలో 90 ఎకరాలు, బొమ్మకల్ రిజర్వాయర్‌కు 75 ఎకరాలు, మల్లారం 120 ఎకరాలు, కొండపాక 80 ఎకరాలు, ఘన్‌పూర్ 60 ఎకరాలు, ఎల్లంపల్లి ఇన్‌టెక్ వెల్‌కు 50 ఎకరాలు, ముర్మూర్‌లో 400 ఎకరాలు, శంకర్‌పల్లిలో 131 ఎకరాలు, చింతపల్లి 30 ఎకరాలు, యాచారం 137 ఎకరాలు, సాహేబ్‌నగర్‌లో 75 ఎకరాలు, కోదండపూర్‌లో 230 ఎకరాలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని భూములు, రిజర్వాయర్లు, ఎస్టీపీలు, అన్ని రకాల కార్యాలయాలు, వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఇలా మొత్తం 14 వేల ఎకరాల భూములున్నాయని అంచనా వేశారు. వీటన్నింటి లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ధరణి ఖాతా నెంబర్..

జలమండలికి కేటాయించిన భూములు 14 వేల ఎకరాలున్నట్టు అధికారులు చెబుతున్నారే కానీ రికార్డుల్లో ఎక్కడా కనపించడంలేదు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా జలమండలి పేరుమీదకు భూములను బదిలీ చేయలేదు. కానీ ఆరునెలల క్రితం జలమండలికి ప్రభుత్వం ‘ధరణి’ ఖాతా నెంబర్ కేటాయించింది. ఈ ఖాతాలోకి సంగారెడ్డి జిల్లాలోని 900 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలోని 100 ఎకరాలను మాత్రం చేర్చారు. మిగిలిన భూములను ధరణి ఖాతాలోకి చేర్చడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై జలమండలికి భూములు కేటాయించిన అన్ని జిల్లాల కలెక్టర్లకు జలమండలి ఎండీ పేరుతో లేఖలు కూడా రాశారు.

హైదరాబాద్‌లో ఇలా..

జలమండలి భూములను ఇతర జిల్లాల్లో ధరణిలో చేర్చుతున్న అధికారులు హైదరాబాద్‌లోని భూముల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ జిల్లాకు ధరణి లేకపోవడంతో భూముల వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం సెక్షన్ 22(ఎ) (నిషేధిత జాబితాలో) చేర్చనున్నారు. హైదరాబాద్ జిల్లాలో గోషామహల్‌లోని కార్యాలయాల సముదాయం, అంబర్‌పేట్‌లోని ఎస్టీపీ, క్రీడా మైదానం, రిజర్వాయర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, సర్కిల్, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ ఆఫీసులు ఉన్నాయి.

జియో ట్యాంగింగ్..

జలమండలి ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. ప్రతి ప్రాపర్టీకి జియో ట్యాంగింగ్ చేయనున్నారు. దీని కోసం ఓ ఏజెన్సీని ఎంపిక చేయడానికి జలమండలి కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇన్‌ట్రెస్ట్(ఈఓఐ) ద్వారా టెండర్లు పిలవనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాల్లో జలమండలి ఆస్తులను గుర్తించడంతో పాటు జియో ట్యాంగింగ్ ద్వారా పరిరక్షించాలని నిర్ణయించారు.

ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ..

జలమండలి ద్వారా ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడంతో పాటు ఆస్తులను పరిరక్షించడం మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ప్రాధాన్యతగా తీసుకున్నారు. మురుగునీటి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. తాగునీటి సరఫరాలో రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు, వెళ్తున్న నీరెంత? లెక్కలు తీసి వాటిని క్రమబద్దీకరించారు. ముఖ్యంగా నీటి సరఫరాలో వాల్వూల నిర్వహణపై దృష్టిసారించారు. ట్యాంకర్ల బుకింగ్, ఫిల్లింగ్ స్టేషన్లలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. వీటితో పాటు జలమండలికి ఉన్న భూములను గుర్తించి పక్కాగా రికార్డుల్లోకి ఎక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే 2009 నుంచి 2012 వరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో టెక్నాలజీని ఉపయోగించి బిల్లుల వసూళ్లలో అక్రమాలకు చెక్ పెట్టిన విషయాన్ని పలువురు అధికారులు, ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే జలమండలి పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలందించే వ్యవస్థను పటిష్టం చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

Next Story