చంచల్‌గూడ జైలు కు వాటర్ బోర్డు జీఎం

by velandi.Saikiran |

హైదరాబాద్ జలమండలి లో అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్‌ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

చంచల్‌గూడ జైలు కు వాటర్ బోర్డు జీఎం
X

చంచల్‌గూడ జైలు కు వాటర్ బోర్డు జీఎం

14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ స్పెషల్ కోర్టు...

త్వరలో కస్టడీకి కోరనున్న ఏసీబీ..

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ జలమండలి లో అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్‌ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బుధవారం ఆయనను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో లక్ష్మీకుమార్‌ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

పొంతన లేని సమాధానాలతో..

రెడ్‌హిల్స్‌ ప్రాజెక్ట్ డివిజన్ 8 జీఎంగా పనిచేస్తున్న లక్ష్మీకుమార్‌ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో 9 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో భారీ ఎత్తున దొరికిన నగదు, స్థిర, చరాస్తుల పత్రాలకు సంబంధించి అధికారులు కుమార్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే, ఏసీబీ అధికారుల ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం తో ఆదాయ వనరులకు మించి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన కేసు లో అయన్ను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

కళ్లు చెదిరే అక్రమాస్తులు..

మల్లాపూర్‌లోని లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో ఏకంగా రూ.1.10 కోట్ల లిక్విడ్ క్యాష్, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి బయటపడిన విషయం విదితమే. వీటితో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు, 6 ప్లాట్లు, ఒక సొంత ఇల్లు ఉన్నట్లు డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం ఆ ఆస్తుల విలువే రూ.5.88 కోట్లుగా చూపించినప్పటికీ.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వాటి వాస్తవ విలువ రూ.వంద కోట్లు దాటుతుందని ఏసీబీ ప్రాథమిక అంచనా. ఇదంతా ఆయన తన సర్వీసులో అవినీతికి పాల్పడి సంపాదించినదేనని చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగుచూడటంతో ఈ కేసు దర్యాప్తును ఏసీబీ ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు త్వరలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కుమార్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. ఆయన అక్రమార్జనకు సహకరించిన బినామీలు, జలమండలిలోని ఇతర అధికారులు, లంచాలు ఇచ్చిన కాంట్రాక్టర్ల డొంక కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story