- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూర్ పరిధికి జలమండలి విస్తరణ.. అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగర భవిష్యత్ తాగునీటి అవసరాలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు

దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలి పరిధి క్యూర్ (CURE) వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శాస్త్రీయ, సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్, మూడు రీజియన్ల ఈడీలు, డైరెక్టర్లు, ట్రాన్స్‌మిషన్, ఓ అండ్ ఎమ్, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో ఉస్మాన్ సాగర్ నుంచి షేక్ పేటతో పాటు గోదావరి జలాల ద్వారా అదనపు నీటి లభ్యత పెరగనున్న నేపథ్యంలో, ఆ నీటిని సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థలు, వాల్వులు, జంక్షన్లు, ఇతర మౌలిక వసతులపై ఇప్పటి నుంచే స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఎండీ సూచించారు. గత వేసవిలో అనూహ్యంగా నీటి సమస్యలు ఎదురైన ప్రాంతాలను గుర్తించి, వచ్చే వేసవికి ముందే ప్రత్యేక కాంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం నుంచి పదిహేను రోజుల్లో ప్రణాళికను ఖరారు చేసి, అక్టోబర్ నాటికి అవసరమైన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మల్కాజిగిరి పరిధిలో కొత్తగా నీటి సమస్యలు ఎదురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎండీ సూచించారు. పెద్ద సామర్థ్యం గల ట్యాంకర్ల కోసం ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, వేగంగా నీరు నింపే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు.
నీటి పంపిణీలో శాస్త్రీయ విధానం..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింగూరు జలాశయంలో ప్రస్తుతం సుమారు 50 రోజులపాటు మాత్రమే సరిపోయే నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో, వర్షాలు సకాలంలో కురవని పరిస్థితి ఏర్పడితే హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ కాంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి అమలు చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి పంపిణీ వ్యవస్థను పూర్తిగా శాస్త్రీయ విధానంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి లభ్యతను బట్టి వివిధ పరిస్థితులకు అనుగుణంగా కాంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ రోజు లేదా నెలవారీ నీటి సరఫరా విధానాలపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
కాంటింజెన్సీ ప్రణాళికలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి నీటిని మళ్లించాలి, దానికి అవసరమైన పైప్‌లైన్లు, వాల్వులు, జంక్షన్లు, రిజర్వాయర్లు వంటి మౌలిక వసతులపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అంచనాలు సిద్ధం చేయడం, టెండర్లు పిలవడం, పనులు ప్రారంభించడం వంటి ప్రక్రియలను రానున్న 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కృష్ణా, గోదావరి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రత్యామ్నాయ జలవనరులను కూడా సమర్థవంతంగా వినియోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎండీ సూచించారు. తాత్కాలికంగా అవసరమైతే అదనపు పంపింగ్ సదుపాయాలు, ఫిల్ట్రేషన్ యూనిట్లు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు నిధుల కొరత అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం అత్యున్నత ప్రాధాన్యత అని, అవసరమైన నిధులు సమకూర్చేందుకు జలమండలి సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, మంజీరా వ్యవస్థల్లో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడం ద్వారా అదనపు నీటి లభ్యతను పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను సూచించారు.
ట్యాంకర్ నిర్వహణలో..
హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో ట్యాంకర్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నందున, ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జలమండలి ఎండీ ఆదేశించారు. ఫిల్లింగ్ స్టేషన్లలో ఆన్‌లైన్ బుకింగ్ విధానం, ట్యాంకర్ల డెలివరీ, ట్రిప్పుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ప్రతిరోజూ సమీక్షించాలని సూచించారు. ట్యాంకర్ నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం లేదా నిబంధనల అమలులో వైఫల్యం కనిపిస్తే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ జలవనరులు, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై..
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్టేడియాలు, జైళ్లు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేటు ఎస్టీపీలను గుర్తించి, శుద్ధి చేసిన నీటి (Treated Water) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ఎండీ ఆదేశించారు. 50 కిలోలీటర్లకు పైగా సామర్థ్యం గల ప్రైవేటు ఎస్టీపీల యాజమాన్యాలతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి, శుద్ధి చేసిన నీటిని ఉద్యానవనాలు, నిర్మాణ పనులు, ఇతర తాగునీరు అవసరం లేని అవసరాలకు వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. జలమండలి ఎస్టీపీల నుంచి ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక, నిర్మాణ, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు సరఫరా చేసే ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని, ఇందుకోసం ట్యాంకర్ల నమోదు, బ్రాండింగ్, ఆన్‌లైన్ బుకింగ్, స్థిరమైన ధరల విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని కనీసం 2 శాతం మేర పెంచగలిగితే, అంత మేర తాగునీటిని ఆదా చేసి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే అవకాశం ఉంటుందని ఎండీ పేర్కొన్నారు. అలాగే నగరంలో నిరంతర నీటి సరఫరా పొందుతున్న ప్రాంతాలు, అధిక వినియోగం ఉన్న కనెక్షన్లు, అవసరానికి మించి నీటిని వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించి, సమాన పంపిణీ జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి చుక్క నీరు విలువైనదనే భావనతో ముందస్తు ప్రణాళిక, సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన నిర్వహణ, ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం ద్వారానే భవిష్యత్ నీటి అవసరాలను సమర్థంగా ఎదుర్కోగలమని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
నీటి నాణ్యతపై రాజీ లేదు..
కలుషిత నీటి సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఉండదని ఎండీ హెచ్చరించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, అవసరమైతే నీటి సరఫరా నిలిపివేయడం, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం, ఫిర్యాదు పరిష్కరించి, పరీక్షల అనంతరం మాత్రమే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మూడు రీజియన్ల ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, వాస సత్యనారాయణ, ప్రభు, సీజీఎంలు, ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రికల్, ఓ అండ్ ఎమ్, జీఎంలు, డీజీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.






