GHMC: వార్డుల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ

by Gantepaka Srikanth |

GHMC: వార్డుల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ

GHMC: వార్డుల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం విస్తీర్ణం భారీగా పెరిగింది. పాత జీహెచ్ఎంసీలోని 150వార్డుల జనాభా, విలీన మున్సిపాలిటీల జనాభా మొత్తం కోటి30లక్షలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ జనాభా ఆధారంగానే జీహెచ్ఎంసీ పరిధిని 300వార్డులుగా పునర్విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీఓ నెం.266ను సోమవారం జారీచేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు 300వార్డులకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ ను బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జారీచేయనున్నారు. అందులో భాగంగానే బుధవారం నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని కమిషనర్ తెలిపారు.

నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ…

డీలిమిటేషన్ పై బుధవారం నుంచి జీహెచ్ఎంసీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. ఈ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరినట్టే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి డీలిమిటేషన్ పై ప్రజలు, వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, సలహాను ఆలస్యం చేయకుండా, ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అభ్యంతరాలు, సలహాలను కేవలం లిఖితపూర్వకంగా సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అభ్యంతరాలను, సలహాలను స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను త్వరగా పరిష్కరించి, పాలనలో పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.

పక్కాగా వార్డుల పునర్విభజన..

జీహెచ్ఎంసీలోని వార్డుల పునర్విభజన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగానే 10రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు రాత్రింబవళ్లు టౌన్ ప్లానింగ్, ఎన్నికల విభాగం, పలువురు సీనియర్ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు సైతం ఈ ప్రక్రియను పూర్తిచేసినట్టు పలువురు అధికారులు చెబుతున్నారు. మొత్తం 300వార్డులు, 50సర్కిళ్లు, 10 జోన్లుగా డిజైన్ చేశారు. ఒక వార్డు రెండు సర్కిళ్ల పరిధిలోకి రాకుండా బౌండరీలు ఫిక్స్ చేశారు. ప్రతి వార్డు పునర్విభజన సమయంలో 45 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకుని పది శాతం తక్కువ, ఎక్కువ జనాభాతో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టారు. తెల్లాపూర్ మున్సిపాల్టీలో పరిధి ఎక్కువగా ఉన్నా, తక్కువ జనాభాతో ఇప్పుడిప్పుడే పట్టణీకరణ వేగంగా జరుగుతుందని గుర్తించిన అధికారులు వార్డును అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే సంవత్సరం చేపట్టనున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టి లో పెట్టుకుని, ఒక వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా జాగ్రత్తగా పక్కాగా, పకగడ్భందీగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.150వార్డులను 300 వార్డులుగా చేసిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను పది జోన్లకు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఒక్కో జోన్ లో 30 వార్డులు వచ్చేలా..5సర్కిళ్లు ఉండేలా ఈ ప్రక్రియను పూర్తిచేసినట్టు సమాచారం. సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గత 10 రోజులుగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు చివరి ఘట్టమైన అభ్యంతరాలను నేటి నుంచి స్వీకరించేందుకు సిద్దమయ్యారు. వీటిని పరిష్కరించడంతోపాటు ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నతర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు ఖరారు..

ఆగమేఘాలపై 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వెంటనే వార్డుల పునర్విభజన వంటివి చేపట్టినా, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఇంకా సమయముందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేస్తే ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ఈ వార్డుల రిజర్వేషన్లను తేల్చనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాను బట్టి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ సమావేశం…

జీహెచ్ఎంసీలో 27యూఎల్బీస్ విలీనం, 300వార్డుల పునర్విభజన వంటి అంశాలను ఈనెల 18న నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. కమిటీ సభ్యుల ఆమోదం తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అనంతరం జనవరి మొదటి వారంలో జనరల్ బాడీ సమావేశంలోనూ 300వార్డుల పునర్విభజన అంశాన్ని చర్చించడంతోపాటు ఆమోదం కూడా తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

ఆప్ లైన్ లోనే అభ్యంతరాల స్వీకరణ : కమిషనర్ కర్ణన్..

300వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రజలు తమ అభ్యంతరాలను, కేవలం ఆప్ లైన్ లోనే స్వీకరించనున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ తెలిపారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లోనూ అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించడాానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడంతోపాటు వెంటనే పరిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ అభ్యంతరాలను మరింత లోతుగా చర్చించడానికి ఈ నెల 18న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు వార్డుల డీలిమిటేషన్ ప్రతిపాదనను ప్రవేశపెట్టి, పాలక మండలి పెద్దలు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Next Story