- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో 24 గంటలు మూడు షిఫ్టుల్లో పనులు
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. గద్దెల తో పాటు గ్రామం, ఇతర ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టి పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. జాతర ప్రాంతాలను సెక్టార్ లుగా విభజించి పనులు చేస్తున్నారు. జాతరకు ఇంకా 29 రోజుల సమయం ఉండటంతో మూడు షిఫ్టుల్లో పనులను కొనసాగిస్తున్నారు. జాతరకు ముందే భక్తులు పోటెత్తుతుండడంతో సమయంలో పనులను పూర్తి చేసే విధంగా ప్రత్యేక అధికారులను నియమించి అక్కడే ఉండే విధంగా చూస్తూ పనులను పూర్తి చేస్తున్నారు.
జాతరకు మరో 29 రోజుల సమయం..
సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 29 రోజులే సమయం ఉంది. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది వాహనాల్లో భక్తులు తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మేడారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని వెళ్లే విధంగా ఈ పనులు చేపడుతున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతీసారి ప్రభుత్వాలు వందల కోట్ల నిధులను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సమ్మక్క గద్దెల వద్ద శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. గద్దెల వద్ద ఫ్లోరింగ్ చేయడంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించడం, రాతి కట్టడాలు చేపడుతున్నారు. ఆదివాసుల గట్టు గోత్రాలను వాటిపై చెక్కుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు.
మూడు షిఫ్టుల్లో పనులు..
జాతర సమయంలో పది రోజుల వరకు లక్షలాది మంది ఇక్కడే ఉండే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్ ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో పనులను కొనసాగిస్తున్నారు. గద్దెల వద్ద ఫ్లోరింగ్ పనులు, గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయడం, క్యూలైన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. భక్తుల కోసం 28 ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండ్ఏర్పాటు చేస్తున్నారు.
వందలాది బస్సులు భక్తులను తరలించనుండటంతో గద్దెల వద్దకు వచ్చే విధంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. మేడారం గ్రామంలో రోడ్లు వెడల్పు, డ్రైనేజీ, కల్వర్టు పనులు పూర్తి చేస్తున్నారు. జాతరకు 29 రోజులే సమయం ఉండటంతో మేడారం తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలను సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు ఒక అధికారితో పాటు 8 మంది ఉద్యోగులను నియమించారు. మొత్తం 47 సెక్టార్లకు 47 మంది అధికారులను నియమించారు. వీరితో పాటు 8 జోన్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. ప్రధాన శాఖల అధికారులందరూ మేడారంలో ఉండి పనులు చేసే విధంగా పర్యవేక్షిస్తున్నారు.
విద్యుత్,నీటి సరఫరాపై దృష్టి
మేడారం జాతరకు విద్యుత్ నిరంతర సరఫరా ఉండాలి. జాతర చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాలి. జాతర కోసం నార్లాపూర్ వద్ద సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. జనవరి 10 లోపు పనులు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. వాహనాలు పార్కింగ్ చేసే వెన్నలాపూర్, చింతల క్రాస్, నార్లపూర్ వద్ద కూడా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జంక్షన్లలో విద్యుత్ నిరంతర సరఫరా జరిగేందుకు పస్రా లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్ పనులతో పాటు రవాణాకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పనులను కొనసాగిస్తున్నారు.
మొదలైన ముందస్తు మొక్కులు..
జాతర ప్రారంభం కాకముందే నిత్యం వేలాది మంది భక్తులు మేడారం వస్తుండటంతో ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. మేడారంలో ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పగలు పనులు జరుగుతుండటంతో ఏఎస్పీ, డీఎస్పీ తో పాటు ఇతర అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ములుగు నుంచి మేడారం వరకు బస్సులు వెళ్లే ప్రాంతాలన్నీ పరిశీలించడం తో పాటు వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు.
జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో మంత్రి సీతక్క, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. జనవరి 5 లేదా 6వ తేదీల్లో సీఎం మేడారం వచ్చే అవకాశం ఉండటంతో ఆలోపు పనులు పూర్తి చేసే విధంగా ప్రయత్నాలను చేస్తున్నారు. రేయింబవళ్లు చేస్తేనే పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ అక్కడే క్యాంప్ వేసి నిత్యం సమీక్షిస్తున్నారు. జనవరి 2వ వారం నుంచి మరింత ముందస్తు మొక్కులు పెరిగే అవకాశం ఉండటంతో పనుల్లో వేగం పెంచారు. నిర్ణీత సమయంలో జాతర పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ దివాకర్ టీఎస్తెలిపారు
- Tags
- Medaram






