- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రుణమాఫీ'తో రైతాంగంలో అంబరాన్నంటిన సంబరాలు.. ఉమ్మడి జిల్లాలో 2,274.09 కోట్ల రుణాలు మాఫీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను ఆదుకుంటామని రైతులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది.

దిశ, వరంగల్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను ఆదుకుంటామని రైతులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. మూడు విడతల్లో లక్షలోపు, లక్షన్నర, రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒకేసారి పంట రుణాలను మాఫీ చేసేందుకుగాను రిజర్వుబ్యాంకు నిబంధనలు అడ్డుతగలడంతో విడతల వారీగా రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.మూడు విడతల్లో కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 265,934 మంది రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరింది. దీంతో రూ. 2,274.09 కోట్ల రుణమాఫీ జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించారు. రూ .2 లక్షల లోపు పంట రుణాలను ఆగస్టు 15 లోగా మాఫీ చేస్తామని ప్రకటించినట్లుగానే ప్రభుత్వం మూడు విడతలుగా రుణమాఫీని చేపట్టింది. రుణమాఫీ లబ్ధి పొందిన రైతుల ముఖంలో చిరునవ్వులు విరబూస్తున్నాయి. కాదనుకున్న రుణమాఫీ నెరవేరడంతో రుణభారం దిగి పోయిందన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మూడు విడతల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ వివరాలు ఇలా ఉన్నాయి..
వరంగల్ - 45939 మంది రైతులకు రూ. 368.09 కోట్లు
హన్మకొండ జిల్లాలో 49206 మంది రైతులకు రూ. 408.23 కోట్లు
జనగామ జిల్లాలో 54870 మంది రైతులకు రూ. 476.33 కోట్లు
మహబూబాబాద్ 58516 మంది రైతులకు రూ. 522.41 కోట్లు
భూపాలపల్లి జిల్లాలో 32926 మంది రైతులకు రూ. 298.31కోట్లు
ములుగు జిల్లాలో 24477 మంది రైతులకు రూ. 200.72కోట్లు
సీఎం రేవంత్‌కు రుణపడి ఉంటాం
- రాయపల్లి పద్మ, తొర్రూరు మహిళ రైతు
మా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో వడ్డీతో కలిపి రూ.1,64,438 రూపాయలు అప్పు ఉంది. రూ.20 వేల వరకు వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన లిస్ట్ లో మా పేరు కూడా ఉంది. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో ఉన్న మొత్తం రుణం రూ. 1,64,438 రూపాయలు ఒకేసారి మాఫీ అయ్యింది. కౌలు చేసుకుంటూ మాకు ఉన్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మా రుణం మొత్తం మాఫీ చేసినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం.
రుణం మాఫీ చేశారు.. మళ్లీ రుణమిచ్చారు
-ముకిరాల సుధాకర్ రావు, కైలాపూర్, భూపాలపల్లి జిల్లా
ఆగస్టు 15 న ప్రభుత్వం చేసిన, రెండు లక్షల రుణమాఫీలో, నాకు రూ. 1.98 వేలు మాఫీ అయ్యాయి. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో, కొంత అప్పులపాలు అయినాను. ఇప్పుడు రుణమాఫీ జరగడంతో నాకు చాలా సంతోషకరంగా ఆనందంగా ఉంది. మళ్లీ బ్యాంకు నుండి రుణాన్ని తీసుకుంటాను. అన్నమాట ప్రకారం రుణమాఫీ చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మాట నిలబెట్టుకున్న సీఎం
-ఎండీ పాషా, కాసిందే పేట, ములుగు
ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ఏ రైతు మర్చిపోడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైయస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయడం సంతోషంగా ఉంది.
మాఫీ లోను రెనివల్ కు వచ్చినా...
జిగట నాగరాజు రైతు కోమటిపల్లి, మంగపేట మండలం
రుణమాఫీ రెండవ విడతలో మా కుటుంబంలో ఒకే రేషన్ కార్డుపై నాకు మా చెల్లె పేరుతో ఉన్న లక్షా అరవై వేలు మాఫీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేయడంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు మళ్లీ బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకోడానికి వచ్చాను. గత ఏడాది కంటే 30 వేలు పెంచి లక్షా 90 వేలు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
రుణభారం దిగులు పోయింది
పోరండ్ల ప్రభాకర్, మర్రిపల్లిగూడెం
2023 లో పీఏసీఎస్ నుంచి రూ. 90 వేల రూపాయలు పంట రుణం తీసుకున్నా. మొదటి విడుతలో రూ. 90 వేల రూపాయలు మాఫీ అయ్యాయి. పంట కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలనే దిగులు ఎప్పుడు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. మాఫీ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.






