- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముల్కనూరు సమస్యలు పట్టించుకునే వారెవరు..?
ముల్కనూర్ గ్రామంలో సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నా పరిష్కార దిశగా చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, భీమదేవరపల్లి : ముల్కనూర్ గ్రామంలో సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నా పరిష్కార దిశగా చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని స్వాతంత్ర సమరయోధుల భవనం పక్కన ఉన్న కుంట చెత్త, చెదారంతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. స్థానిక చికెన్, మటన్ సెంటర్ల నుంచి వచ్చే మాంస వ్యర్థాలను కుంటలోనే పడేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాలనీ మురికికాలువ కూడా అదే కుంటలో కలవడంతో పరిస్థితి మరింత విషమించింది. ఇక ముల్కనూరు సొసైటీ పరపతి సంఘానికి చెందిన మిల్లు నుంచి ఎగిసే దుమ్ము ధూళి, అక్కడి నుంచి వెలువడే మురికికాలువలు పరిసరాలను అపరిశుభ్రంగా మార్చుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుమ్ము, దుర్వాసనతో సమీప కాలనీల్లో నివసించే ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
మురికికాలువలు శుభ్రపరచకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ చెత్తకుంట పక్కనే మోడల్ స్కూల్ భవనం ఉంది. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తుండగా, హాస్టల్‌లో ఉండే విద్యార్థులు రాత్రివేళ భరించలేని దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని వారు అంటున్నారు. కుంట సమీపంలోని ఓపెన్ జిమ్ వద్ద వ్యాయామం చేసే వారికి కూడా దుర్వాసనతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. బస్టాండ్ సమీపంలోని కొన్ని వాడల్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వర్షాలు కురిసినప్పుడు రహదారులు మట్టి, నీటితో నిండిపోతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కూడలిలో తెలంగాణ స్థూపం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల చుట్టూ సరైన ట్రాఫిక్ సూచికలు, రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బస్టాండ్ పరిసరాల్లో 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు కూల్చివేత నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “నోటీసులు ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు” అని వారు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ వాల్ వరకు మాత్రమే నోటీసులు ఇచ్చి, ముల్కనూరు సొసైటీ స్థలం వరకు ఉన్న ఇతర దుకాణాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది గ్రామపంచాయతీ స్థలం కాదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికగా నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పెరుగుతున్న సమస్యలపై సంబంధిత శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి కుంట శుట్రాఫిక్ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు వ్యాపారుల సమస్యపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలు ఇలాగే కొనసాగితే ఆందోళనలకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముల్కనూర్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక ప్రజల నిరసనల తర్వాతే చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్న గ్రామంలో గట్టిగా వినిపిస్తోంది.






