- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఏది?
లింగనిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా.. జిల్లా స్థాయిలో మాత్రం స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

దిశ,వరంగల్ బ్యూరో : లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టింపు లేదు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు గొలుసుకట్టు ఒప్పందాలు జరుగుతున్నాయి. నెట్వర్క్ పేరున ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగనిర్ధారణ చేయడంతో పాటు వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. అన్ని వసతుల పేరు చెప్పి కొన్ని చోట్ల అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా పుట్టబోయే ఆడ శిశువుల భ్రూణహత్యలు జరుగుతున్నాయని నిషేధం ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో పట్టింపు లేదు. ఇష్టారాజ్యంగా నిబంధనలను ఉల్లంఘించి స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరీక్షల వల్ల చివరకు హత్యల వరకు దారి తీస్తున్నాయి. స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. వరంగల్ నగరం పరిధిలో వందకు పైగా ఉండగా నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాల్పల్లి, పరకాల, వర్ధన్నపేట, తొర్రూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. రోగ నిర్ధారణ కోసం స్పెషలిస్టు డాక్టర్ల సూచనల మేరకు ఈ స్కానింగ్ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించాలి. నిబంధనల మేరకు పరీక్షలు చేసి రిపోర్టులను ఇవ్వాలి. ఆయా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా ఈ పరీక్షలను చేయాలి. స్కానింగ్ చేసే టెస్టు ఆధారంగా వెయ్యి రూపాయల నుంచి 5వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఆర్ఎంపీలను నెట్ వర్క్ గా పెట్టుకొని..
స్కానింగ్ కేంద్రాల్లో గర్భిణీలకు గర్భం ఎలా ఉందో విషయం తెలుసుకునేందుకు మాత్రమే చేయాలి. జన్యుపరమైన వైకల్యాలు ఉంటే చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. గర్భస్థ పిండం అనారోగ్యంగా ఉంటే తగిన చికిత్స అందించేందుకు ఈ పరీక్షలు చేయాలి. కానీ కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ, మగ నిర్ధారణ చేస్తున్నారు. ఈ స్కానింగ్ వల్ల వివరాలు ముందే తెలియడంతో కొన్ని రకాల కలహాలకు కుటుంబంలో దారి తీస్తుంది.
కొన్ని కేంద్రాల పరిధిలో ఆర్ఎంపీలను నెట్ వర్క్ గా పెట్టుకొని ఈ పరీక్షలు చేస్తున్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇష్టారీతిన పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతీ స్కానింగ్ కేంద్రంలో రేడియాలజిస్టు ఉండాలి. ఆయన ఆధ్వర్యంలోనే పరీక్షలు జరగాలి. వీరితో పాటు అసిస్టెంట్, పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కొన్ని కేంద్రాల్లో రేడియాలజీ టెక్నీషియన్ ద్వారా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈ స్కానింగ్ కేంద్రాల పై నిఘా పెట్టకపోవడం, తరచూ తనిఖీలు చేయకపోవడం, నెలవారి నివేదికలు తీసుకోకపోవడం వల్ల ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం లింగనిర్ధారణ చేయడంతో మూడో కాన్పులో కూడా ఆడపిల్లే అని తేలడంతో ఇద్దరు పిల్లలతో పాటు తల్లిని కూడా ఈతకొలనులో ముంచి చంపివేశారు. నర్సంపేట పరిధిలో ఓ యువతికి కడుపులో గడ్డలు ఉంటే గర్భిణీగా నిర్ధారించారు. పెళ్లికాని యువతి ఆందోళనకు గురికాగా మరో ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తే గడ్డలుగా తేలడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ కేంద్రాలపై తనిఖీలు చేపట్టకపోవడం వల్ల భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్
గర్భంలో ఉన్న శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గర్భస్థ శిశువు గురించి తెలుసుకోవడం, గర్భస్రావం చేయడం చట్టవిరుద్ధమైన చర్యలు అని ఆయన అన్నారు. ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి ఈ పరీక్షలే కారణం అని తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలు ఎక్కడైనా జరిగితే డయల్ 100 నెంబర్ తో పాటు 8712685257 కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని ఆయన కోరారు. స్కానింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. అన్ని కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.






